పాప పుడితే రూ.1500, బాబు అయితే 2వేలు | Petlaburj Hospital Staff Collecting Money | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

May 18 2019 8:56 AM | Updated on May 25 2019 12:24 PM

Petlaburj Hospital Staff Collecting Money - Sakshi

పేట్లబురుజు ఆస్పత్రి

చేవెళ్లకు చెందిన ఆదినారాయణ భార్య రజిత నిండుగర్భిణి. ఆమెకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఈ నెల 12న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది. నడవలేని పరిస్థితిలో ఉంది. కాన్పు చేసేందుకు స్టెచర్‌పై లేబర్‌రూమ్‌కు తీసుకెళ్లేందుకు రూ.100, ప్రసవం తర్వాత తిరిగి వార్డుకు చేర్చేందుకు రూ.100, పుట్టిన బిడ్డను శుభ్రం చేసేందుకు రూ.200, బిడ్డను అప్పగించేందుకు రూ.2 వేలు చె ల్లించుకోవాల్సి వచ్చింది. ఇలా ఒక్క రజిత భర్త మాత్రమే కాదు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చినవారి నుంచి కొంతమంది సిబ్బంది రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో :ఇక్కడ ఆడ, మగ బిడ్డల జననంపై ధరలు నిర్ణయిస్తారు. పురిటి బిడ్డను కళ్లారా చూసుకునేందుకు సైతం రేట్లు నిర్ణయించారు. లేదంటే చీత్కారాలు.. చీదరింపులు ఎదుర్కొవాల్సిందే. ‘తమ వద్ద డబ్బుల్లేవ్‌.. మమ్మల్ని వదిలే యండి’ అంటూ కాళ్లావేళ్లా పడినా కనికరించే వారే ఉండరంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్‌ కిట్‌లో భాగంగా పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రతిష్టాత్మక సుల్తాన్‌ బజార్, పేట్లబురుజు, నిలోఫర్, గాంధీ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య 40 శాతం పెరిగింది. అయితే ఆయా ఆస్పత్రుల్లోని లేబర్‌రూముల్లో పని చేస్తున్న సిబ్బంది ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రిలో చేరి.. ప్రసవం తర్వాత డిశ్చార్జి అయ్యేంతవరకూ సిబ్బందికి రూ.4 వేలకుపైగా సమర్పించుకోవాల్సి వస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన రోగులను పట్టించుకోకపోవడమే కాకుండా సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.  

పేట్లబురుజులో వసూళ్ల దందా..
ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 60కిపైగా ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ పుట్టిన బిడ్డను చూసేందుకే కాదు, నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను లేబర్‌వార్డుకు తరలించాలన్నా.. ప్రసవం తర్వాత థియేటర్‌ నుంచి బాలింతను లేబర్‌రూమ్‌ నుంచి స్టెచర్‌పై వార్డుకు తరలించేందుకు రూ.100, పుట్టిన శిశువును శుభ్రం చేసినందుకు రూ.100, శిశువును అప్పగించేందుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. బాలింతను పరామర్శించేందుకు వచ్చే బంధువులు ప్రధానగేటు వద్ద రూ.20, ఆ తర్వాత రెండో గేటు వద్ద రూ.20, మూడో గేటు వద్ద రూ.20 చొప్పున చెల్లించుకోవాల్సివస్తోంది. వార్డులను శుభ్రం చేసే శానిటేషన్‌ సిబ్బందికి రోజుకు రూ.20 చెల్లించాల్సిందే. ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చని భావించి ఆస్పత్రికి వచ్చిన వారిని నిలువునా దోచుకుంటుండటంతో రోగులు, వారివెంట వచ్చిన బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా వార్డుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన ఆర్‌ఎంఓలు, సూపరింటెండెంట్‌లు తమ గదులు దాటి బయటికి రావడం లేదు. సిబ్బంది వసూలు చేసిన అక్రమ సొమ్ములో ఆర్‌ఎంఓలకు కూడా వాటాలు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.    

వసూల్‌ రాజాలకే వంత..  
సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 25 కాన్పులు జరుగుతాయి. కీలకమైన విభాగాల్లో సైతం రెగ్యులర్‌ ఉద్యోగులను పక్కనపెట్టి, కాంట్రాక్టు కార్మికులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా కాంట్రాక్టు సిబ్బంది వసూలు చేసిన మొత్తం నుంచి ఆయా విభాగాల ఇన్‌చార్జిలకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. ఎంతోకొంత ఇష్టంతో ఇస్తే తీసుకొని, అంతటితో సంతృప్తి చెందాలి కానీ ఇంతే ఇవ్వాలని డిమాండ్‌ చేయడమేంటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.  ఇక నిలోఫర్‌ ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రసవం తర్వాత బంధువులెవరైనా బాలింతలను పరామర్శించాలన్నా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా.. అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. ఎవరైనా ఇందుకు నిరాకరించి, అవుట్‌ పోస్టింగ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. నీవేమైనా లక్షలిస్తున్నావా.. ఇచ్చి పోరాదు..! అంటూ వారూ వసూల్‌ రాజాలకే వంత పాడుతుండటం కొసమెరుపు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement