పర్మిషన్‌ ఈజీ

పాలమూరు: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5నుంచి ఈ–దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులకు దరఖాస్తు చేసుకోవడం సులవైంది. దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లో అనుమతి లభించడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరళీకృత వ్యాపార విధానం అభివృద్ది చేయడానికి ఈ విధానం అమలు చేశారు. నూతన పరిశ్రమ కోసం ఆన్‌లైన్‌ ద్వార లబ్దిదారుడు దరఖాస్తు చేసుకుంటే దానిని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పరిశీలన చేసిన తర్వాత 30రోజుల్లో అనుమతి లభిస్తుంది. 

దరఖాస్తు చేసుకున్నవారు ఇలా.. 
2015లో ఉమ్మడి జిల్లానుంచి 285 దరఖాస్తులు వస్తే 250 పరిశ్రమలకు అనుమతి లభిచింది.  
2016 మే 25 నుంచి 2017 ఆగష్టు 5వరకు 551 దరఖాస్తులు  
2107 ఆగస్టు 6నుంచి అక్టోబర్‌ 20వరకు 80 పరిశ్రమలకు 105 దరఖాస్తులు  

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులకు ఇప్పటి వరకు 98శాతం అనుమతి లభించగా మరో 20శాతం ప్రక్రియ కొనసాగుతున్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31లోపు అనుమతి పత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31 వరకు అనుమతి పత్రం రాకపోతే మళ్లీ వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.   

పెండింగ్‌లో నిధులు
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి పరిశ్రమలకు, వాహనాలకు ఇస్తున్న రాయితీలు దాదాపు కోట్లలలో పెండింగ్‌లో ఉన్నాయి. 2014 మే నుంచి 2015 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత రాయితీని ఖాతాలో జమ చేశారు. 2015 జూన్‌ నుంచి 2017 అక్టోబర్‌ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు రావాల్సి ఉంది. అయితే ఈ రెండేళ్ల కాలంలో దాదాపు కోట్లలో బకాయిలు ఉన్నాయి.  

పారదర్శకత పెరుగుతోంది
ఆన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోవడంతో కార్యాలయం చూట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సెక్షన్స్‌లలో సంబంధిత అధికారులను అడగాల్సిన అవసరమూ ఉండదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెండు రోజుల్లోనే దరఖాస్తులను పరిశీలన చేసి అన్ని పత్రాలు ఉన్నాయా లేదా చూసి సక్రమంగా ఉంటే విచారణకు వెళ్తున్నాం. నెల రోజుల లోపు అనుమతి పత్రం వస్తుంది. ఈ విధానంతో పారదర్శకత పెరిగింది.  
– సురేష్‌కుమార్, జనరల్‌ మేనేజర్‌ పరిశ్రమల శాఖ, మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top