ఆగుతూ.. సాగుతూ

People's Problems With Drainage Water Likeg Wanaparthy - Sakshi

వనపర్తి :  జిల్లా కేంద్రంలో నిత్యంరద్దీగా ఉండే బ్యాంక్‌ స్ట్రీట్‌లో చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రెండునెలలుగా ఈ కాలనీవాసులు, ఇక్కడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. రాకపోకలకూ తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 2018 మార్చిలో ఈ పనులకు కేటీఆర్‌ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో ఈ పనులకు అధికారులు టెండర్లు, అగ్రిమెంట్‌ ప్రక్రియను చేపట్టారు. 2019 ఏప్రిల్‌లో పనులను ప్రారంభించారు. రూ.1.31 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులు గత రెండు నెలలుగా కేవలం 20శాతం పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

సుమారు ఐదుబ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు, వందకుపైగా.. వ్యాపారదుకాణాలు, నివాస గృహాలు ఉన్న ఈ రోడ్డులో పనుల కారణంగా రాకపోకలకు  తీవ్ర   ఇబ్బందులు   ఎదురవుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఒకేసారి డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టి గోతులు తవ్వటంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహదారులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రధానమైన బీటీ, ఫుట్‌పాత్‌ సీసీ నిర్మాణం చేయాల్సి ఉంది. కేవలం 560 మీటర్ల కాంక్రీట్‌ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టేందుకే రెండు నెలల సమయం తీసుకుంటే.. మిగతా పనులు చేపట్టేందుకు ఎంతకాలం పడుతుందని ఈ రోడ్డు మార్గాన వెళ్లే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

చేయాల్సి పనులు ఇవే..  
బ్యాంక్‌ స్ట్రీట్‌గా పిలువబడే.. ఈరోడ్డు ఆర్టీసీ డిపో నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1.31 కోట్ల నిధులు కేటాయించారు. ఇరువైపులా 560 మీటర్ల కాంక్రీట్‌ రోడ్డు, 33 ఫీట్ల బీటీరోడ్డు, రోడ్డుకు ఇరువైపులా.. ఒక్కోవైపు ఆరు ఫీట్ల చొప్పున మొత్తం 12 ఫీట్ల సీసీ ఫుట్‌పాత్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీవ్‌ చౌక్‌ నుంచి పూజా ఎలక్ట్రానిక్స్‌ వరకు మాత్రమే పనులు చేయనారంభించారు. అక్కడి నుంచి డిపో వరకు పనులు సంగంలోనే ఆగిపోయాయి. రాజీవ్‌చౌక్‌ నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు ఒకవైపు డ్రెయినేజీ నిర్మాణం ఇదివరకే చేసిన కారణంగా.. పడమర వైపు మాత్రమే నిర్మాణం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా పనులు ప్రారంభంకాలేదు.

ప్రధాన చౌరస్తాలో మురికి కూపం  
జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ప్రధాన రాజీవ్‌చౌక్‌లో డ్రెయినేజీ నీరు నిలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పుర పాలకులు, అధికారులు ఎన్నోసార్లు ఈ ప్రధాన కూడలి గుండా వెళ్తుంటారు. కానీ ఎవ్వరికీ ఈ సమస్య పట్టకపోవటం గమనార్హం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిరువ్యాపారులు మురికి కూపం నుంచి వచ్చే దుర్గంధంను భరించకతప్పని పరిస్థితి ఏర్పడింది.

దుకాణాల ఎదుట కర్ర నిచ్చెనలు  
డ్రెయినేజీ నిర్మాణం కోసం రెండు వైపులా గోతులు తవ్వటంతో బ్యాంకులకు, వ్యాపార దుకాణాలకు, నివాసగృహాలకు వెళ్లే వారు కర్రనిచ్చెనలు రూ.వేలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే.. ఓ ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు కర్రనిచ్చెన దాటబోయి కిందపడి గాయాలపాలైంది. అయినా పనుల్లో వేగం పెరగలేదు.
  
రోడ్డుపై పారుతున్న మురుగునీరు  
రెండు వైపులా ఒకేసారి డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో ఇరువైపుల నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఈ దారిగుండా వెళ్లే పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. అనారోగ్యం పాలవుతున్నామని అంటున్నారు.
 

పుర పాలకులకు పట్టదా..?  
నిత్యం జిల్లా కేంద్రంలో ఉండే.. పురపాలకులు ఈ పనుల జాప్యం విషయంలో ఎందుకు చొరవ చూపించటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటికి మంచినీరు వచ్చే కుళాయి పైప్‌లైన్‌లు కట్‌ అయ్యాయి. దీంతో మున్సిపల్‌ సిబ్బంది రెండుమూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో ఈ రోడ్డున ఉన్న నివాసగృహాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్డు సుందరీకరణ పనులు నెమ్మదించడం, ఇక్కడి ప్రజల ఇబ్బందుల విషయమై ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు ట్విటర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.  

ఆక్రమణల విషయంలో ఆలస్యమైంది  

ఈ రోడ్డులో కొన్ని నిర్మాణాలు మున్సిపల్‌ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని చేశారు. వాటిని తొలగించి డ్రెయినేజీ నిర్మాణం చేయాల్సి ఉన్నందు వల్ల ఆలస్యమైంది. మరో రెండుమూడు రోజుల్లో డ్రెయినేజీల నిర్మాణం పూర్తిచేసి బీటీ రోడ్డు వేయిస్తాం. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.  – భాస్కర్, మున్సిపల్‌ ఇంజనీర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top