‘ఆసరా’ అయోమయం | Pensioners details not compare with integrated family survey | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ అయోమయం

Nov 18 2014 12:02 AM | Updated on Oct 22 2018 7:36 PM

సామాజిక పింఛన్ల పథకం(ఆసరా) అమలు ప్రక్రియ జిల్లా యంత్రాంగంలో...

సాక్షి, రంగారెడ్డి జిల్లా : సామాజిక పింఛన్ల పథకం(ఆసరా) అమలు ప్రక్రియ జిల్లా యంత్రాంగంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి అర్హతను నిర్ధారించిన అధికారులకు తాజాగా పింఛన్ల పంపిణీ సంకటంగా మారింది. అర్హతను తేల్చి 2,05,940 మంది లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, తాజా దరఖాస్తుల పరిశీలన వివరాలు ఏమాత్రం సరిపోలకపోవడంతో అర్హులుగా ఎంపికైన పలువురిని చివరకు అనర్హులుగా సాఫ్ట్‌వేర్ తేల్చడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

 జిల్లాలో ఆసరా పథకం కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ఉపక్రమించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని లబ్ధిదారులుగా తేల్చారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదు చేపట్టిన అధికారులు.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ వివరాలను ఎంపీడీఓ లాగిన్‌లోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చితే అర్హుల కార్డుల తుది ఫార్మాట్ ప్రత్యోక్షమవుతుంది.

ప్రస్తుతం వీరికి కార్డులు అందించిన తర్వాత పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కార్డులను ప్రింట్ తీసేందుకు సదరు వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో మ్యాచ్ చేయగా.. అర్హులుగా నిర్ధారించిన పలువురు అనర్హులయ్యారు. ఇప్పటివరకు లక్ష మంది వివరాలను ప్రింట్ చేసేందుకు ప్రయత్నించగా.. దాదాపు 25వేల మంది అనర్హులుగా సాఫ్ట్‌వేర్ తేల్చడంతో అధికారులు జుట్టుపీక్కుంటున్నారు.

 నిలిచిన పింఛన్ల పంపిణీ..
 జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో పింఛన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీచేసి పింఛన్లు ఇచ్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేల మందికి ఇచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మిగతా వారికి మరుసటి రోజునుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా.. సాఫ్ట్‌వేర్‌లో అర్హుల జాబితాలో తప్పులు చూపడంతో కార్డుల ముద్రణ నిలిపివేశారు.

దీంతో కార్డుల ప్రింటింగ్ ముగిసిన తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.. పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్యపై మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు డీఆర్‌డీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement