వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడు.
మహబూబాబాద్: వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడు. ఆపరేషన్ వికటించడం వల్లే మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపిస్తుండగా, గుండెపోటుతో మృతి చెందినట్టు చికిత్స అందించిన వైద్యుడు చెప్పుతున్నారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
మహబూబాబాద్ మండలం రెడ్యాల శివారు కొల్లగుంట తండాకు చెందిన భూక్యా సక్రు (60) శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికు వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్స చేసేందుకు ముందు ముక్కుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.
అది వికటించి మృతి చెందినట్టు సక్రు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, వైద్యుడు మాత్రం... ఆపరేషన్ సమయంలో ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని, తమ వంతు ప్రయత్నం చేసిన తర్వాత ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా రోగి మృతి చెందినట్టు తెలిపారు.