సాకే స్థోమత లేకనే బిడ్డను ఇచ్చేశా

Parents Told We Not Sold Girl Child - Sakshi

దత్తత ఇవ్వలేదు.. అమ్ముకోలేదు

చైల్డ్‌లైన్‌ ప్రతినిధులకు చెప్పిన చిన్నారి తండ్రి  

అధికారులకు అంగీకార పత్రం రాసిచ్చిన పకీరప్ప

తాండూరు శిశుగృహకు చిన్నారి తరలింపు

బషీరాబాద్‌(తాండూరు): బషీరాబాద్‌ మండలం నావంద్గి గ్రామంలో వెలుగు చూసిన పసిపాప అక్రమ దత్తత వ్యవహారం బుధవారం కీలక మలుపు తిరిగింది. నెల రోజుల వయసున్న ఆడబిడ్డను తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చామే తప్ప.. అమ్ముకోలేదని చెన్నారం గ్రామానికి చెందిన పాప తండ్రి పానాదుల పకీరప్ప అధికారులకు తెలిపారు. అనారోగ్యంతో భార్య చనిపోవడం వలన మానసికంగా కుంగిపోయానని, ఈ పరిస్థితుల్లో పాప ఆలనా పాలనా చూసే ఆర్థిక స్థోమత లేదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. తన బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తూ అధికారులకు స్టాంపు పేపర్‌పై అంగీకార పత్రం రాసిచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

నిబంధనలకు విరుద్ధంగా దత్తత...
యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన పానాదుల పకీరప్ప, జగ్గమ్మ దంపతుల నెల రోజుల వయసున్న కూతురిని పది రోజుల కిందట దూరపు బంధువులైన నావంద్గి బొడ్డు బాలప్ప, అమృతమ్మ, బాలమణి దంపతులకు అప్పగించారు. అయితే ఇది అక్రమ దత్తతని 1098 చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్‌ ప్రతినిధి హన్మంత్‌రెడ్డి సమాచారాన్ని అధికారులకు అందించారు. బుధవారం వీఆర్‌ఓ రాఘవేందర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నర్సమ్మ, శిశుగృహ ఎంఎస్‌డబ్ల్యూ నరేష్, హన్మంత్‌రెడ్డి నావంద్గి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పిల్లలను ఎలా తీసుకుంటారని బాలప్ప అమృతమ్మ, బాలమణి దంపతులను నిలదీశారు. అయితే పెంచుకోవడానికి బంధువులు ఇచ్చారని, తమ దగ్గర ఉన్న పాపను అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వారు అధికారులకు బదులిచ్చారు. వెంటనే పాపను తీసుకుని.. పాప తండ్రి పకీరప్పను పిలిచి విచారించారు. తనకు బిడ్డను సాకే స్థోమత లేదని, ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తండ్రి పకీరప్ప అధికారులతో చెప్పాడు. దీంతో తండ్రిగా వంద రూపాయల స్టాంపుపై బిడ్డను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అంగీకార పత్రం రాసిచ్చాడు. అనంతరం అధికారులు ఆ పాపను తాండూరు శిశు గృహకు తరలించారు. కార్యక్రమంలో శిశు గృహ ఇన్‌చార్జి శ్రీనివాస్, యాలాల చైల్డ్‌లైన్‌ ప్రతినిధి వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top