సబ్సిడీ విత్తుకు మంగళం | Paddy seeds removed from the list of National Food Security Programme | Sakshi
Sakshi News home page

సబ్సిడీ విత్తుకు మంగళం

May 14 2014 11:55 PM | Updated on Sep 2 2017 7:21 AM

మెదక్ జిల్లాలో వరి విత్తనాల సబ్సీడీకి ప్రభుత్వం మంగళం పాడింది. విస్తారమైన వరి ధాన్యం ఉత్పత్తులతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతికెక్కిన ఈ జిల్లాను తాజాగా జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి తొలగించడంతో ఈ దుస్థితి తలెత్తింది.

గజ్వేల్, న్యూస్‌లైన్:  మెదక్ జిల్లాలో వరి విత్తనాల సబ్సీడీకి ప్రభుత్వం మంగళం పాడింది. విస్తారమైన వరి ధాన్యం ఉత్పత్తులతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతికెక్కిన ఈ జిల్లాను తాజాగా జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి తొలగించడంతో ఈ దుస్థితి తలెత్తింది. వరి సాగు విస్తారంగా సాగడం వల్లే సబ్సీడీ ఇవ్వలేమనే వాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ పరిస్థితి వల్ల రైతులకు ప్రస్తుత ఖరీఫ్‌లో
 వరిపై రూ.2 కోట్లకుపైగా సబ్సీడీ కోల్పోయే దయనీయస్థితి నెలకొంది.

 సాగు పెరిగినా...సాయంలేదు
 వరి అంటేనే గుర్తుకు వచ్చేది మెదక్ జిల్లా. జిల్లాలోని కొన్ని చోట్ల మినహాయిస్తే  సింహభాగం బోరుబావుల ఆధారంగా వరిపంట సాగు చేస్తున్నారు. ప్రతిఏటా ‘వరి’పై రైతులు ‘మమకారం’ ప్రదర్శించడంవల్ల ఏటికేడు వరిసాగు పెరుగుతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం కలిగినా, వరిసాగుకే రైతన్న మొగ్గుచూపుతున్నాడు. అకాల వర్షాలు రైతును నిలువునా ముంచినా, అర్ధరాత్రి కరెంటు కాటు వేసినా వరిసాగుమాత్రం విడవడం లేదు. అందువల్లే జిల్లాలో ప్రతిఏటా సుమారు లక్ష హెక్టార్ల వరకు వరి సాగవుతోంది.  ఇలాంటి సందర్భంలో రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం..అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

 సబ్సిడీలన్నీ ఎత్తివేసి రైతుకు మొండిచేయి చూపుతోంది. అంతేకాకుండా విత్తనాలను, ఎరువులను సైతం సకాలంలో పంపిణీ చేయకుండా ఇబ్బందులు పెడుతోంది. అయినప్పటికీ కష్టనష్టాలన్నింటికీ ఎదురొడ్డి రైతన్నలు వరిసాగు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  ప్రతి ఏటా ఇస్తున్న కొద్దోగొప్పో ఇస్తున్న విత్తనాల సబ్సీడీకి కూడా ఈసారి మంగళం పాడేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది జిల్లాలో 90 వేల హెక్టార్లలో వరి సాగైతే అధికారులు 36 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సీడీ కింద పంపిణీ చేశారు.

 ఈ లెక్కన రైతులకు రూ.1.80 కోట్లకుపైగా సబ్సీడీ వర్తించింది. ఈ సారి మాత్రం జిల్లాలో వరి సాగు విస్తారంగా సాగుతోందన్న అంశాన్ని సాకుగా చూపిన సర్కార్ ‘జాతీయ ఆహార భద్రతా పథకం’ నుంచి మెదక్ జిల్లాను తొలగించింది. ఈ కారణంతో వరికి సబ్సీడీని ఇవ్వలేమని  చేత్తులెత్తేసింది. ఇది తెలియని రైతులు  సబ్సీడీ వరి విత్తనాల కోసం వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, అధికారులు మాత్రం సబ్సీడీ విషయం తేలలేదని చెబుతూ మాటను దాటవేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement