breaking news
National Food Security Programme
-
ఏప్రిల్ 1 విడుదల
జాతీయ ఆహార భద్రతా పథకం.. దేశంలో అల్పాదాయవర్గాల వారికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమిది. జాతీయ స్థాయిలో ఏప్రిల్ 1 నుంచి శ్రీకారం చుడుతున్న ఈపథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే అందరికి ఆహార భద్రతసాధ్యమయ్యేనా అనే అనుమానాలుతలెత్తుతున్నాయి. అదే సమయంలో బియ్యం అక్రమార్కులు మరింత రెచ్చిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఆహార భద్రత పథకం అమలుకు జిల్లా యంత్రాంగం గత నెలరోజులుగా ముమ్మర కసరత్తు చేస్తోం ది. గత నెల 26న ఉత్తరాంధ్ర జిల్లాల వర్కుషాపు కూడా ఈ అంశంపై విశాఖలో నిర్వహించింది. జీవీఎంసీ పరిధిలో 413, గ్రామీణ జిల్లా, ఏజెన్సీల పరిధిలో 1599 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో అల్పాదాయ వర్గాల వారికి తెల్లకార్డులు 10,45,838, ఏఏవై 75,889, అన్నపూర్ణ 1,035 కార్డులున్నాయి. వీటిపరిధిలో 39,15,217 మంది (యూనిట్స్) ఉండగా, మనుగడలో లేని 70 వేల కార్డులను తొలగించడం వల్ల వాటి పరిధిలో ఉన్న 5,03,961 యూనిట్లను తొలగించారు. ఇప్పటివరకు 33,59,667 యూనిట్లకు ఆధార్ సీడింగ్ పూర్తిచేశారు. మరో 61,254 యూనిట్లకు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. అంటే సీడెడ్, అన్సీడెడ్యూనిట్లు కలిసి 33,56,137 మంది ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు 4కేజీల చొప్పున కుటుంబానికి గరిష్టంగా 20 కేజీలకు మించకుండా సరఫరా చేస్తున్నారు. జిల్లాలో తెలుపుకార్డుదారులకు 12974.188 మెట్రిక్‌టన్నులు, ఏఏవై కార్డుదారులకు 2652.445 ఎంటీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 ఎంటీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. మహానేత సంకల్పమిదే..: ఒక కుటుంబంలో నలుగురుకు మించి కుటుంబ సభ్యులున్నా సరే ఆ కుటుంబానికి ఇప్పటివరకు 20కేజీలే లభించేవి. ఈ బియ్యం ఏ మూలకు సరిపోవన్న భావనతో ప్రతి కుటుంబానికి 30 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని దివంగత మహానేత నిర్ణయించారు. 2009 ఎన్నికల్లో ఈ ఒక్క హామీనే ఇచ్చారు. మహానేత హఠన్మరణం తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. మహానేత ఆశయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోందని చెప్పవచ్చు. ఆరుగురు అంతకంటే ఎక్కువ మందితో కూడిన ఉమ్మడి కుటుంబాలు జిల్లాలో మచ్చుకైనా కన్పించని పరిస్థితి. ఒక వేళ ఒకే ఇంట్లో ఉంటున్నా పెళ్లవగానే కొత్తకార్డులు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర ఉంటున్నప్పటికీ వారికి ప్రత్యేకంగా కార్డులుంటున్నాయే తప్ప ఉమ్మడిగా అందరికి కలిపి ఒకేకార్డు ఉండే పరిస్థితిలేదు. మహా చూస్తే ఒక కార్డులో నలుగురు లేదా తల్లిదండ్రులు కలుపుకుంటే ఆరుగురు సభ్యులతో కూడిన కార్డులు మినహా అంతకుమించి ఎక్కువసభ్యులున్న కార్డులు జిల్లావ్యాప్తంగా నాలుగైదు శాతంకూడా ఉండవు. 20 శాతం పెరగనున్న కేటాయింపులు ప్రస్తుతం ఉన్న కార్డుల్లోని సీడెడ్ యూనిట్లను బట్టి చూస్తే జిల్లాకు 17,086.955 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని అంచనా. అంటే ప్రస్తుత కేటాయింపులకు అదనంగా మరో 1500 మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతాయని, అంటే 15 నుంచి 20 శాతం మేర కేటాయింపులు అదనంగా అవసరమవుతాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నుంచే తొమ్మిది జిల్లాలకు సరిపడా కేటాయింపులు జరుపుతున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో బియ్యం కేటాయింపులు ఖరారు కానున్నాయని, 26 కల్ల్లా విశాఖ గొడౌన్‌కు చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇన్యాక్టివ్పేరుతో 70 వేల కార్డులను, ఐదు లక్షల యూనిట్లను తొలగించిన సర్కార్ ఆధార్ సీడింగ్ పేరుతో మరింత కోతకు సిద్ధమవుతోంది. అవసరమైతే నిజంగా బియ్యం, ఇతర నిత్యావసర సరకులు తీసుకుంటున్నవారందెరు? తీసుకోకుండా ఇతర అవసరాల కోసం కార్డులు తీసుకున్నవారెవరో గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. కేటాయింపులను కుదించడం ద్వారా భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోదన్న విమర్శలు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు మరింత ఊతం! ఇప్పటికే సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యంలో కనీసం 40 శాతం పక్కదారి పడుతున్నట్టు అంచనా. రేషన్ బియ్యానికి పాలిష్ పెట్టి రిసైక్లింగ్ చేస్తూ మళ్లీ బహిరంగ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కార్డుల్లో కనీసం 30 శాతం తనఖా పెట్టుకుని మరీ కొంతమంది డీలర్లు అక్రమార్కులకు గుట్టుచప్పుడు కాకుండా నేరుగా బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆహారభద్రత పుణ్యమాని పెరగనున్న బియ్యం కేటాయింపులు వీరికివరంగా పరిణమించే అవకాశం ఉంది. కొత్తగా అమలులోకి తీసు కొస్తున్న ఈ-పాస్ విధానం కొంతమేర చెక్ పెట్టే అవకాశాలున్నప్పటికీ కచ్చితమైన నిఘా.. సరైన పర్యవేక్షణ లేకుంటే ఈ అక్రమార్కులకు మరింత రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదని అధికారులే అంగీకరిస్తున్నారు. -
ఆహార భద్రత భారం రూ.960 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జాతీయ ఆహార భద్రతా పథకం నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగానే పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం తొలగించిన కార్డులను మినహాయించి, మిగిలిన లబ్ధిదారులకు ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తే ఏటా ఏకంగా రూ.960 కోట్ల మేర భారం పడే అవకాశాలున్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు 75 శాతం గ్రామీణ, 50 శాతం పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రతా పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. ఈ లెక్కన ఆహార భద్రత పథకానికి 1.91 కోట్ల మంది అర్హులుగా తేల్చిన కేంద్రం.. అందుకు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని లెక్కకట్టింది. అదనంగా ఉన్న కుటుంబాలకు అయ్యే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించింది. తాజా అంచనా మేరకు ఆహార భద్రత పథకం కింద రాష్ట్రంలో సుమారు 2.71 కోట్ల మంది అర్హులుగా ఉంటారని సర్కారు తేల్చింది. కేంద్రం కిందకు వచ్చేవారిని మినహాయిస్తే రాష్ట్రం సుమారు 80 లక్షల మంది భారాన్ని మోయాల్సి వస్తుంది. వీరికి ప్రతినెలా 4 కేజీల బియ్యాన్ని అందించాలంటే బహిరంగ మార్కెట్లో కిలో బియాన్ని రూ.25 వరకు కొని లబ్ధిదారులకు కిలో రూపాయికే అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో లభ్ధిదారునిపై రూ.100 చొప్పున మొత్తం 80 వేల మందిపై ఏటా రూ.960 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ఆహార భద్రత పథకం అమలుకు మొత్తం 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా, కేంద్రం తన వాటాగా 13 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తుంది. మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నుల భారాన్ని రాష్ట్రం మోయాల్సిందే. దీనిపై మరోమారు కేంద్రాన్ని సంప్రదించి పథకం అదనపు భారాన్ని తగ్గించాలని కోరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
సబ్సిడీ విత్తుకు మంగళం
గజ్వేల్, న్యూస్‌లైన్: మెదక్ జిల్లాలో వరి విత్తనాల సబ్సీడీకి ప్రభుత్వం మంగళం పాడింది. విస్తారమైన వరి ధాన్యం ఉత్పత్తులతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతికెక్కిన ఈ జిల్లాను తాజాగా జాతీయ ఆహార భద్రతా పథకం జాబితా నుంచి తొలగించడంతో ఈ దుస్థితి తలెత్తింది. వరి సాగు విస్తారంగా సాగడం వల్లే సబ్సీడీ ఇవ్వలేమనే వాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ పరిస్థితి వల్ల రైతులకు ప్రస్తుత ఖరీఫ్‌లో వరిపై రూ.2 కోట్లకుపైగా సబ్సీడీ కోల్పోయే దయనీయస్థితి నెలకొంది. సాగు పెరిగినా...సాయంలేదు వరి అంటేనే గుర్తుకు వచ్చేది మెదక్ జిల్లా. జిల్లాలోని కొన్ని చోట్ల మినహాయిస్తే సింహభాగం బోరుబావుల ఆధారంగా వరిపంట సాగు చేస్తున్నారు. ప్రతిఏటా ‘వరి’పై రైతులు ‘మమకారం’ ప్రదర్శించడంవల్ల ఏటికేడు వరిసాగు పెరుగుతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం కలిగినా, వరిసాగుకే రైతన్న మొగ్గుచూపుతున్నాడు. అకాల వర్షాలు రైతును నిలువునా ముంచినా, అర్ధరాత్రి కరెంటు కాటు వేసినా వరిసాగుమాత్రం విడవడం లేదు. అందువల్లే జిల్లాలో ప్రతిఏటా సుమారు లక్ష హెక్టార్ల వరకు వరి సాగవుతోంది. ఇలాంటి సందర్భంలో రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం..అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సబ్సిడీలన్నీ ఎత్తివేసి రైతుకు మొండిచేయి చూపుతోంది. అంతేకాకుండా విత్తనాలను, ఎరువులను సైతం సకాలంలో పంపిణీ చేయకుండా ఇబ్బందులు పెడుతోంది. అయినప్పటికీ కష్టనష్టాలన్నింటికీ ఎదురొడ్డి రైతన్నలు వరిసాగు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా ఇస్తున్న కొద్దోగొప్పో ఇస్తున్న విత్తనాల సబ్సీడీకి కూడా ఈసారి మంగళం పాడేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది జిల్లాలో 90 వేల హెక్టార్లలో వరి సాగైతే అధికారులు 36 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సీడీ కింద పంపిణీ చేశారు. ఈ లెక్కన రైతులకు రూ.1.80 కోట్లకుపైగా సబ్సీడీ వర్తించింది. ఈ సారి మాత్రం జిల్లాలో వరి సాగు విస్తారంగా సాగుతోందన్న అంశాన్ని సాకుగా చూపిన సర్కార్ ‘జాతీయ ఆహార భద్రతా పథకం’ నుంచి మెదక్ జిల్లాను తొలగించింది. ఈ కారణంతో వరికి సబ్సీడీని ఇవ్వలేమని చేత్తులెత్తేసింది. ఇది తెలియని రైతులు సబ్సీడీ వరి విత్తనాల కోసం వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, అధికారులు మాత్రం సబ్సీడీ విషయం తేలలేదని చెబుతూ మాటను దాటవేస్తున్నారు.