పెళ్లయిన మూడు నెలలకే..
సిద్దిపేట జిల్లా: అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (ఎర్రవల్లి)కి చెందిన వనం సుగుణ–నర్సింలు దంపతుల పెద్ద కూతురు వసంతకు గజ్వేల్‌కు చెందిన సమీప బంధువుతో ఆగస్టు 10న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 18 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు.
వసంత ఉన్నత చదువులకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత.. ఈనెల 1న పురుగుల మందు తాగింది. కడుపులో నొప్పి వస్తోందంటూ తన తల్లి సుగుణకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది.
విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వసంతను మెరుగైన చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి, అక్కడి నుంచి పలు ప్రైవేటు ఆస్పత్రు ల్లో చికిత్స చేయించినప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి వసంత మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వసంత మృతికి కారణమైన భర్త రోహిత్, అత్త దుర్గమ్మ, మామ గంగయ్యలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


