12.6 కిలోమీటర్లు.. 14 నిమిషాలు | Organs Supply With Green Channel Scheme | Sakshi
Sakshi News home page

12.6 కిలోమీటర్లు.. 14 నిమిషాలు

Feb 8 2019 10:30 AM | Updated on Feb 8 2019 10:30 AM

Organs Supply With Green Channel Scheme - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి– బేగంపేటలోని పాత విమానాశ్రయం మధ్య మార్గం... అనునిత్యం రద్దీగా ఉండే ఈ రూట్‌లో 12.6 కిమీ దూరాన్ని అంబులెన్స్‌ కేవలం 14 నిమిషాల్లో అధిగమించింది. ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ఛానల్‌ ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది. కోయంబత్తూర్‌లోని పీఎస్‌జీ ఆసుపత్రికి ‘ప్రయాణించాల్సిన’ ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్‌ (లైవ్‌ ఆర్గాన్స్‌) కోసం నగర ట్రాఫిక్‌ పోలీసులు ఈ సదుపాయం కల్పించారు. అంబులెన్స్‌కు పైలెట్‌గా వాహనంలో వెళ్ళిన బృందం మొదలు ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది.

ఈ లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్‌ మధ్యాహ్నం 1.21 గంటలకు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరింది. దీంతో అన్నిస్థాయిల ట్రాఫిక్‌ అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. డోనర్‌ ఇచ్చిన లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ బేగంపేట విమానాశ్రయం వరకు ఉన్న దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు పని చేశారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లింది. అలానే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.35 గంటలకు ‘లైవ్‌ ఆర్గాన్స్‌ బాక్స్‌’లతో కూడిన అంబులెన్స్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో కోయంబత్తూరు వెళ్లాయి. ట్రాఫిక్‌ పోలీసుల సహకారం వల్లే ఈ తరలింపు సాధ్యమైందంటూ యశోద ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement