ఆపరేషన్ డెరైక్టర్ | Operation director | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ డెరైక్టర్

Oct 16 2014 2:38 AM | Updated on Sep 22 2018 7:53 PM

ఆపరేషన్ డెరైక్టర్ - Sakshi

ఆపరేషన్ డెరైక్టర్

ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో డెరైక్టర్లది కీలకపాత్ర. ఇందులోనూ రూ.లక్షల్లో జీతం... మరిన్ని అలవెన్సులు.

  •  సీఈ స్థాయితోపాటు రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్ల క్యూ
  •  పోటాపోటీగా ఆశావహుల పైరవీలు
  •  అమాత్యులతో పలువురి రాయ‘బేరాలు’
  • హన్మకొండ సిటీ : ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడంలో డెరైక్టర్లది కీలకపాత్ర. ఇందులోనూ రూ.లక్షల్లో జీతం... మరిన్ని అలవెన్సులు. ఒక్కసారి డెరైక్టర్‌గా నియామకమైతే పొడిగింపు పేరిట మరి కొన్నేళ్లు ఈపదవిలో కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న కీలకమైన  డెరైక్టర్ (ఆపరేషన్) పోస్టుపై పలువురు కన్నేశారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న
    సీఈ స్థాయి అధికారులతోపాటు, సీఈ స్థాయిలో రిటైర్ అయిన విద్యుత్ ఇంజనీర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇంతకుముందు ఆపరేషన్ డెరైక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్ కాలపరిమితి ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. అప్పట్లో ప్రభుత్వం మూడు నెలల పాటు కాలపరిమితిని పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30తో ఆయన పదవీ కాలం ముగిసింది.  మరోసారి కాలపరిమితిని పెంచకపోవడంతో చంద్రశేఖర్.. డెరైక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ డెరైక్టర్ వెంకటేశ్వర్‌రావుకు ఆపరేషన్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

    ఈ క్రమంలో సీజీఎంలుగా పనిచేస్తున్న ఎండీ యూనస్, రాజారావుతోపాటు విద్యుత్ శాఖలో సీఈలుగా పని చేసి రిటైర్ అయిన వారు, ఎస్పీడీసీఎల్‌లో సీఈ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు పలువురు రేసులో ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎలాగైనా ఈ పోస్టును  దక్కించుకునేందుకు ఆశావహులు... అమాత్యుల వద్దకు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.  కుల, మత, సామాజిక, రాజకీయ సమీకరణాలను ఆసరాగా చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
     
    ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలో...

    ఎన్పీడీసీఎల్‌లో ఒక సీఎండీతో పాటు, నాలుగు డైరక్టర్ పదవులున్నాయి. ఇందులో సీఎండీగా కొంటే వెంకటనారాయణతో పాటు ఫైనాన్స్ డెరైక్టర్‌గా సుదర్శన్, ప్రాజెక్ట్ డైరక్టర్‌గా బి.వెంకటేశ్వర్‌రావు, హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్‌గా జాన్‌ప్రకాశ్‌రావు కొనసాగుతున్నారు. మరో డెరైక్టర్ (ఆపరేషన్) పదవి ఖాళీగా ఉంది. రెండేళ్ల కాలం పాటు ఉండే ఈ డెరైక్టర్ పోస్టును భర్తీ డెరైక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూన్ మాసంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టు కోసం 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వీటిని పరిశీలించి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది.
     
    పోటాపోటీగా యత్నాలు
     
    ఆపరేషన్ విభాగం సీజీఎంగా ఉన్న యూనస్, వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సీజీఎం, ప్రస్తుతం సెలవులో ఉన్న రాజారావు డెరైక్టర్ కుర్చీ కోసం దరఖాస్తు చేసుకొన్న వారిలో ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు దరఖాస్తు చేసుకున్న వారిలో మరికొందరు ప్రభుత్వ పెద్దలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అమాత్యులతో రాయ‘బేరాలు’ నడుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి అధికారులు కేటాయింపు పూర్తి కాలేదు. దీంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది.

    ఇటీవల కేంద్రం ఐఏఎస్ అధికారులను కేటాయించినట్లు జాబితా విడుదల చేసినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి శాఖలు అప్పగించలేదు. దీంతో డెరైక్టర్ (ఆపరేషన్) నియామకంలో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ వర్గాలు చెబుతున్నారుు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న విధాన నిర్ణయాలే కొనసాగుతున్నాయి. ఇందులో మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే డెరైక్టర్ పదవీ భర్తీలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముందని అంచని వేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement