విద్యుత్‌ బిల్లులకూ జీఎస్టీ అడుగుతున్నారు..

One apartment residents went to State Consumer Forum - Sakshi

వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు 

ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ ఈస్టర్న్‌ ప్రావిన్స్‌పై ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: నిర్వహణ చార్జీలను జీఎస్టీతో కలిపి చెల్లిస్తున్నా, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు, జీతాలకు సైతం జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్‌ చెల్లించాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌లు తమను ఒత్తిడి చేస్తున్నాయంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్‌మెంట్‌వాసులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్‌ చెల్లించకుంటే, నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొంటామంటూ ఇందూ ప్రాజెక్ట్స్‌ బెదిరిస్తోందని, తమకు మానసిక క్షోభ కలిగిస్తున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్‌మెంట్స్‌ కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఫోరం ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, తెలంగాణ హౌసింగ్‌ బోర్డులను ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌లు అపార్ట్‌మెంట్ల నిర్వహణ, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు, తోట పని, లిఫ్ట్‌ల నిర్వహణ తదితరాలన్నింటినీ ఔట్‌ సోర్సింగ్‌కి ఇచ్చి, అందుకు సంబంధించిన వ్యయాన్ని ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీతో కలిపి తమ నుంచి వసూలు చేస్తున్నాయంది. మానసిక వేదనకు గురి చేసినందుకు తమకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.24.9 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఫోరంను కోరింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top