breaking news
Indhu project
-
విద్యుత్ బిల్లులకూ జీఎస్టీ అడుగుతున్నారు..
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ చార్జీలను జీఎస్టీతో కలిపి చెల్లిస్తున్నా, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, జీతాలకు సైతం జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్ చెల్లించాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు తమను ఒత్తిడి చేస్తున్నాయంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్‌మెంట్‌వాసులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్ చెల్లించకుంటే, నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొంటామంటూ ఇందూ ప్రాజెక్ట్స్ బెదిరిస్తోందని, తమకు మానసిక క్షోభ కలిగిస్తున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్మెంట్స్ కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఫోరం ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, తెలంగాణ హౌసింగ్ బోర్డులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు అపార్ట్మెంట్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, తోట పని, లిఫ్ట్‌ల నిర్వహణ తదితరాలన్నింటినీ ఔట్ సోర్సింగ్కి ఇచ్చి, అందుకు సంబంధించిన వ్యయాన్ని ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీతో కలిపి తమ నుంచి వసూలు చేస్తున్నాయంది. మానసిక వేదనకు గురి చేసినందుకు తమకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.24.9 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఫోరంను కోరింది. -
కోర్టుకు హాజరైన జగన్, సబిత
సాయిరెడ్డి, నిమ్మగడ్డ, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఏఎస్‌లు కూడా.. ‘ఇందూ ప్రాజెక్టు’ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో ఇందూ ప్రాజెక్టు పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టుల ఇన్చార్జి న్యాయమూర్తి, మూడో అదనపు ప్రత్యేక జడ్జి రమణనాయుడు ముందు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు కె.రత్నప్రభ, బీపీ ఆచార్య, ఏపీఐఐసీ మాజీ సీఈ దామెర పార్థసారధి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ సంస్థల ఆడిటర్ సీవీ కోటేశ్వరరావులు కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను జగన్, సాయిరెడ్డిల తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి.. శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు చెందిన కంపెనీలు ఇందూ టెక్‌జోన్, ఎస్పీఆర్, భూమి రియల్ ఎస్టేట్ల తరఫు న్యాయవాది ఎంజే శివరామకృష్ణ సమర్పించారు. సబిత, నిమ్మగడ్డ, ఆయన కంపెనీ జీ-2 కార్పొరేట్ సర్వీస్‌ల తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు, బీపీ ఆచార్య తరఫు న్యాయవాది సురేందర్‌రావు, రత్నప్రభ తరఫు న్యాయవాది వీర్రాజు, పార్థసారధి తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్, కోటేశ్వరరావు తరఫు న్యాయవాది నళినీ కుమార్‌లు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కాగా, లేపాక్షి సంస్థపై దాఖలైన చార్జిషీట్‌కు సంబంధించి జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ఇతర నిందితులు ఈ నెల 15న కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే మొహర్రం సందర్భంగా 15న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో 14న హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ తరఫు న్యాయవాది నివేదించారు. ఈనెల 16 నుంచి ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... ఈ కేసును విచారిస్తున్న రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి గురువారం ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సూచించారు. జగన్‌ను చూసి కన్నీరు పెట్టిన మహిళ కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళ్తున్న జగన్‌ను చూసిన ఓ మహిళ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టింది. ఇది గమనించిన జగన్ ఆ మహిళను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు. జై జగన్ అంటూ కొందరు మహిళలు నినాదాలు చేయడంతో వారి దగ్గరకు కూడా వెళ్లి పలకరించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సామాన్యులెవరినీ న్యాయస్థానం ఉన్న గగన్‌విహార్ భవన సముదాయంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ అతికష్టంగా భవన ప్రవేశమార్గం వద్దకు చేరుకున్న కొందరు ప్రజలు జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అందరికీ అభివాదం చేసిన జగన్ అక్కడి నుంచి నిష్ర్కమించారు.