పాత కారు.. కొత్త మోజు

Old Cars New Trends in Hyderabad - Sakshi

 భద్రంగా 1926 నాటి ఆస్టిన్, ఫోర్డ్‌లు

15 విభిన్న రకాల మోడళ్ల సేకరణ

నవాబ్‌ ముర్తుజా అలీ వెరైటీ హాబీ

బంజారాహిల్స్‌: కాలం చెల్లిన పాత కార్లను చాలామంది స్క్రాబ్‌ దుకాణాలకు అమ్మేస్తుంటారు. కానీ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–3లోని అరోరా కాలనీకి చెందిన యువకుడు నవాబ్‌ ముర్తుజా అలీ హుస్సేన్‌ మాత్రం అలా చేయడు. తన తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న పాత కార్లను భద్రంగా ఉంచుతున్నాడు. అంతేగాక పాత కార్లను కొనుగోలు చేస్తూ వాటిపై తన మక్కువను చాటుకుంటున్నాడు. ముర్తుజా అలీ హుస్సేన్‌ది నవాబుల కుటుంబం. ఇంటర్‌ వరకు చదివి ప్రస్తుతం కార్ల వ్యాపారం చేస్తున్నాడు. తన షెడ్‌లో 1926 నాటి ఆస్టిన్, ఫోర్డ్‌ కార్లు ఇప్పటికీ ఉన్నాయి. 1938లో తయారైన మోరిస్‌ టైగర్, 1945కు చెందిన మోరిస్, 1948కు చెందిన జాగ్వార్‌ కార్లు ఆయన ఇంటిలో కొలువుదీరాయి. వింటేజ్‌ కార్ల ప్రదర్శనలో వీటిని పెడుతుంటారు. ఇప్పటి వరకు తన వద్ద 15 పాత కార్లు ఉన్నాయని, వాటిని అపురూపంగా చూసుకుంటానని వెల్లడించాడు. తన హాబీ వెనక ఉన్న విశేషాలను ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.   

ఎంతో గర్వంగా ఉంటుంది..
‘మా నాన్న నవాబ్‌ సయ్యద్‌ కుర్బాన్‌ అలీ. ముంబైలో అంబానీ వ్యక్తిగత సలహాదారుగా పనిచేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆయన మృతి చెందారు. మా తాత నవాబ్‌ ఇనాయత్‌ జంగ్‌. బహదూర్‌ నిజాం సర్కార్‌లో పనిచేసేవారు. నాటి నుంచి మేం నవాబులమయ్యాం. 1926లో నగరంలో అతి కొద్ది మందికి మాత్రమే కార్లు ఉండేవి. అందులో మా కుటుంబం ఒకటి. అప్పటి కారును ఇప్పటి వరకు మా ఇంట్లో భద్రంగా ఉంది. తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన పాత కార్లను భద్రంగా ఉంచారు. నేను సైతం ఇదే బాటలో నడుస్తున్నా. నేను జాగ్వార్‌ వింటేజ్‌ కారులో సిటీ రోడ్లపై తిరుగుతుంటా. అంతా నన్నే చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది.  వివిధ దేశాలవారు నా వద్ద ఉన్న కార్లను చూసేందుకు వస్తుంటారు. దేశంలో జరిగే వింటేజ్‌ కార్ల ప్రదర్శనకు కార్లను తీసుకెళ్తుంటాను. నా వద్ద 1926 నాటి మోడల్‌ ఫోర్డ్‌ కారు రూ.కోట్లు వెచ్చించినా దొరకదు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్లలోనే ఫంక్షన్లకు వెళుతుంటాం. అక్కడ అందరి కళ్లూ వీటిపై ఉంటాయి. అరోరా కాలనీలో పాత కార్లు ఒకే ఇంట్లో పార్కు చేసి ఉండటంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తుంటారు’ అని ముర్తుజా అలీ హుస్సేన్‌ ఆనందం వ్యక్తంచేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top