పెద్ద వయసు డాడీ.. పెను సమస్యల దాడి

Old Age Became Father Effects on Childrens - Sakshi

ఆలస్యంగా తండ్రి కావడం చేటే  

పిల్లల్లో అనారోగ్య సమస్యలకు అవకాశం

ఓ అమెరికన్‌ అధ్యయనంలో వెల్లడి

మగాడికేముంది? ఏ వయసులోనైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు. కానీ మహిళలకు అలా కాదు కదా.. సమాజంలో పేరుకుపోయిన ఓ అభిప్రాయం ఇది. శరీర నిర్మాణ వైవిధ్యాలు కూడా దీనికి అనుగుణంగా ఉండడంతో ఇది అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే పెద్ద వయసులో తండ్రి కావడం వల్ల మగవాళ్లకు కాకపోయినా అలా పుట్టే పిల్లలకు రకరకాల సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఓ సర్వే. తగిన వయసులో పెళ్లి, పిల్లల్ని కనడం అవసరమని సూచిస్తోంది. 

సాక్షి, సిటీబ్యూరో : కేరీర్, ఆర్థిక భద్రత కోసం..  నలభై ఏళ్లకు కాస్త అటూ ఇటూగా వయసు ఉండే మగవాళ్ల చేతుల్లో నెలల పసికూనలు.. కనపడడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణం. రకరకాల కారణాలు పెళ్లిని, ఆ తర్వాత సంతాన భాగ్యానికి అడ్డుతగులుతున్నాయి. ఎంచుకున్న కెరీర్‌కు అనుగుణంగా చదివే చదువులు పూర్తయ్యేటప్పటికి కనీసం పాతికేళ్లు నిండుతున్నాయి. ఆ తర్వాత ఉద్యోగమో, మరో రంగంలోనో స్థిరపడేటప్పటికి మరో ఐదేళ్లు, ఇల్లు, తగినంత ఆర్థిక భద్రత కోసం మరో నాలుగైదేళ్లు.. ఇలా ప్రస్తుతం మగవాళ్లు పెళ్లి చేసుకునే వయసు అటూ ఇటుగా 35 ఏళ్లకు చేరింది. ఆ తర్వాత వీళ్లకి సంతానం కలిగేసరికి మధ్యవయసు వస్తోంది. గుండెలపై చిన్నారి పాదాలు నృత్యం చేయడం, కన్నబిడ్డ చేత నాన్నా అని పిలిపించుకోవడం.. పురుషులకి ఓ మధురానుభూతి. పితృత్వపు ఆనందం సంపూర్ణంగా పొందాలంటే తగిన వయసులోనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి లేని పక్షంలో ఎదురయ్యే సమస్యలు ఆ అనుభూతిని హరించివేసే ప్రమాదం ఉంది. దీనిపై నగరంలోని ఇందిరా ఐవీఎఫ్‌ సెంటర్‌కు చెందిన ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ స్వాతి మోతె చెప్పిన విశేషాలివీ.. 

పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..  
మహిళల్లో పెద్ద వయసు కారణంగా సంతాన ప్రాప్తికి అవసరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలహీనపడడం, మోనోపాజ్‌ సమీపించే ప్రమాదాలు ఉంటాయి. మగవాళ్లలో అలాంటి సమస్య ఉండదని భావిస్తారు. ఈ తరహా ఆలోచనలతో పెద్ద వయసు తండ్రులకు పిల్లలు జన్మించడం అనేది ఒకప్పటితో పోలిస్తే బాగా పెరిగింది. ఉదాహరణకు 40 ఏళ్లు దాటిన తర్వాత తండ్రులు కావడం అనేది దశాబ్దాల క్రితం 4శాతం కాగా ఇప్పుడు 10శాతం. మగవాళ్లలో మధ్య వయసు దాటాక సంతానలేమితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టినా.. వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది.

సర్వే ‘జననా’..  
సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌లు నమోదు చేసిన దాదాపు 40 మిలియన్ల జననాల రికార్డ్స్‌ను విశ్లేషించిన తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ అంశాలను వెల్లడించింది. గత అక్టోబరు 21న బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఆ పరిశోధనా ఫలితాల ప్రకారం.. తండ్రి వయసు కూడా తల్లీ, పిల్లలపై ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోంది. తండ్రి వయసు సగటు 35 ఏళ్ల అయిన పక్షంలో జనన ప్రమాదాల్లో కొద్దిగా హెచ్చుదల ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పురుషుడి డీఎన్‌ఎలో జరిగే రెండు నూతన ఉత్పరివర్తనలు జనన శిశువులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి స్పష్టం చేసింది. కనీసం 35ఏళ్లు దాటిన తండ్రులు కన్న బిడ్డల్లో అత్యధికులకు జనన సమయంలో ప్రమాదావకాశాలు హెచ్చుగా ఉంటున్నాయి. అలాగే మధ్య వయసు తండ్రుల పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అంతేకాదు పుట్టిన వెంటనే వెంటిలేషన్‌ అవసరం ఏర్పడుతోంది. తండ్రి అయ్యే వయసు మరింత పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ప్రమాదావకాశాలు కూడా పెరుగుతున్నాయి. వయసు 35 కన్నా మించిన వయసులో తండ్రి అవుతున్నవారికి నెలలు నిండని పిల్లలు పుట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వయసు 50 దాటిన తండ్రుల్లో 28 శాతం మందికి పుట్టిన బిడ్డ నియోన్యాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో చేరాల్సిన అవసరం ఏర్పడుతోంది.  

తల్లికీ ముప్పే..
వయసు దాటాక తండ్రి అవుతున్న పురుషుల కారణంగా ఆ బిడ్డలను కన్న తల్లులు సైతం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారని పరిశోధన వెల్లడించింది. తండ్రి వయసు ప్రభావం తల్లి గర్భధారణపై రకరకాలుగా ఉంటుంది. ఇలాంటి తల్లులకు ప్రసూతి సమయంలో మధుమేహంవచ్చే అవకాశాలు ఉన్నాయి.  

తగిన వయసులోనే మేలు..
తగిన వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మంచిది. వీలైనంత వరకూ పెళ్లయిన తర్వాత  ఎక్కువ కాలం పిల్లలను వాయిదా వేయకపోవడం అవసరం. వయసు మీరాక పెళ్లి– పిల్లలు అనే పరిస్థితి నుంచి పుట్టే సమస్యలపై ప్రస్తుత తరంలో అవగాహన పెరగాల్సి ఉంది.            – డాక్టర్‌ స్వాతి మోతె

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top