ఓలా ఎలా?

Ola Cab Drivers Go On Flash Strike In Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన క్యాబ్‌ డ్రైవర్లు

ఓలా కార్యాలయం వద్ద ధర్నా

సాక్షి, హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్లు మరోసారి రోడ్డెక్కారు. అంతర్జాతీయ క్యాబ్‌ సంస్థల వేధింపులను నిలిపివేయాలని, తమ శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని ఓలా కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జై డ్రైవరన్న అసోసియేషన్‌తో పాటు ఇతర సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాబ్‌ డ్రైవర్లు పాల్గొన్నారు. లీజు విధానాన్ని రద్దు చేయాలని, వాహనాల కేటగిరీలతో నిమిత్తం లేకుండా ప్రతి కిలోమీటర్‌కు రూ.23 చొప్పున డ్రైవర్లకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా జై డ్రైవరన్న అసోసియేషన్‌ అధ్యక్షుడు సిద్ధార్థగౌడ్‌ మాట్లాడుతూ.. వేలాది వాహనాలను లీజు రూపంలో దారుణంగా దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు లభించే ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రతి రోజు రూ.1150 చొప్పున వసూలు చేస్తున్నారని,  రోజంతా కష్టపడినా డ్రైవర్‌కు ఏ మాత్రం ఆదాయం లభించడం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. డ్రైవర్లను జలగల్లాగా పీడించే లీజు పద్ధతిని రద్దు చేయాలన్నారు. క్యాబ్‌లకు మినీ, మైక్రో, షేర్, ప్రైమ్‌ వంటి పేర్లు పెట్టి అతి తక్కువ చార్జీలు చెల్లించడం పట్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్యాబ్‌ సంస్థల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే స్వయంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. డ్రైవర్లకు ఈఎస్‌ఐ, పెన్షన్, తదితర సదుపాయాలతో పాటు ఎయిర్‌పోర్టు, బస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు.   

క్యాబ్‌ సర్వీసులు నిలిపివేత  
ఇలా ఉండగా, తమ న్యాయమైన డిమాండ్ల సాధానకు ఓలా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోవడంతో గురువారం నుంచి నగరంలో క్యాబ్‌ సర్వీసుల బంద్‌ చేపట్టనున్నట్లు సిద్ధార్థగౌడ్‌ తెలిపారు. ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top