‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’ | Sakshi
Sakshi News home page

‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’

Published Sat, Jan 18 2020 10:05 PM

NTR 24th Vardhanthi In Ravindra Bharathi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు.

ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక‌ చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్‌ చంద్రకాంత్ సినిమా చేయడం‌ తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం‌ చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. 

సీనియర్‌నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన‌ కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్‌పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక ఎన్నో‌ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు.

కేవీ రమణాచారి  మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని‌ ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని  పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు.  లక్ష్మీ పార్వతి ఈ‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement