ముహూర్తం చూసుకుంటున్నారు

Notification for phase 1 of LS polls on Monday - Sakshi

19, 25 తేదీల్లోనే నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఆసక్తి

తారాబలం వల్ల కలసి వస్తుందంటున్న జ్యోతిషులు

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి ఈ నెల 25 వరకు లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. రెండు సెలవు రోజులు పోగా నామినేషన్ల స్వీకరణకు 6 రోజులే మిగలడం, అందులోనూ సుముహూర్తాలు కేవలం రెండు రోజులే ఉన్నట్లు జ్యోతిష్కులు చెబు తుండటంతో ఆ తేదీల్లో నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ నెల 19, 25 తేదీల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పండితుల లెక్కల ప్రకారం, ఈ నెల 19న మంగళవారం మఖ నక్షత్రం, త్రయోదశి తిథి ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కలసి వస్తుందని పేర్కొంటున్నారు. మంగళవారం మంచిరోజు కాద న్న అభిప్రాయం తప్పని భావించే వారు 19న నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నామినేషన్లు వేసిన 28 మంది ప్రముఖ పార్టీల అభ్యర్థులందరూ గెలుపొందారని గుర్తుచేస్తున్నా రు.

21న గురువారం ఉత్తర నక్షత్రం, పౌర్ణమి–పాఢ్యమి తిథి రానుండటం మంచి ముహూర్తమని పం డితులు పేర్కొంటున్నారు. అయితే ఆ రోజు హోలీ సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 22న మంచి రోజనే భావన ఉన్నా శుక్రవారానికి ఆది దేవత లక్ష్మీదేవి అయిన కారణంగా ఎన్నికల వ్యయం భారంగా మారుతుందనే చర్చ ఉంది. దీంతో శుక్రవారం నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. 23న శనివారం కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవచ్చు. ఇక 24న ఆదివారం స్వాతి నక్షత్రం రానుండటంతో సుమూర్తంగా భావిస్తారని కానీ, ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. 25న సోమ వారం విశాఖ నక్షత్రం, పంచమి తిథి రానుండటంతో నామినేషన్ల దాఖలకు సమూహర్తమని పండితులు పేర్కొంటున్నారు. 

 నోటిఫికేషన్‌... 
తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందడి సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు తొలివిడత కింద ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్‌సభ స్థానాలుండగా మొత్తం స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెలవు రోజులు మినహా ఇతర పని దినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవులు కావడం తో నామినేషన్లు స్వీకరించరు. 25తో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తి కానుంది. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top