ఆస్కార్‌ ఘనత | Indian-origin director Geeta Gandbhir returns empty handed after double Oscar nomination | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ ఘనత

Mar 18 2026 1:45 AM | Updated on Mar 18 2026 1:45 AM

Indian-origin director Geeta Gandbhir returns empty handed after double Oscar nomination

ఆస్కార్‌లో భారతీయ మహిళలు తమ ఘనతను చాటుతూనే ఉన్నారు. తాజాగా ప్రకటించిన 2026 ఆస్కార్‌ ఆవార్డులలో గీతా గంద్‌భిర్‌ ‘ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరీ’లో ‘ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగం’లో రెండు నామినేషన్లు పొంది ఇలా రెండు నామినేషన్లు పొందిన తొలి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమెకు ఆస్కార్‌ దక్కకపోయినా రెండు నామినేషన్లతో పేరు మార్మోగుతోంది.

‘మనం మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటారు గీతా గంద్‌భిర్‌. సినిమాలో కల్పన ఉంటుంది. డాక్యుమెంటరీలో వాస్తవం ఉంటుంది. వాస్తవం చూపించి వాస్తవికమార్పు తేవడమే గీతా గంద్‌భిర్‌ లక్ష్యం. అందుకే ఆమె తీసిన డాక్యుమెంటరీలు ఆస్కార్‌ చివరి మెట్టు వరకూ చేరాయి. అవార్డు గెలవకపోవచ్చు... కాని గెలిచినంత పని చేసి ప్రపంచం దృష్టిలో పడ్డాయి. అది చాలు గీతా గంద్‌భిర్‌కు. సమస్యను జనం దృష్టికి తెస్తే వాళ్లు ఆలోచిస్తారని ఆమెకు తెలుసు. ఆమెను చూసి స్ఫూర్తి పొందాల్సిన సంగతి అదే.

రెండు నామినేషన్లు
లాస్‌ ఏంజెలెస్‌లో మార్చి15న జరిగిన 98వ ఆస్కార్‌ అవార్డు వేడుకలో భారతీయ సంతతికి చెందిన దర్శకురాలు గీతా గంద్‌భిర్‌ పేరు మారుమోగింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగంలో ఆమె దర్శకత్వం వహించినæ‘ది డెవిల్‌ ఈజ్‌ బిజీ’ షార్ట్‌లిస్ట్‌ అయితే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరీలో గీత నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ది పర్ఫెక్ట్‌ నైబర్‌’ నామినేషన్‌ కు చేరింది. ఇలా ఒక భారతీయ సంతతికి చెందిన మహిళ రెండు నామినేషన్లు సాధించడం రికార్డు.

డాక్యుమెంటరీలు దేని గురించి?
‘ది డెవిల్‌ ఈజ్‌ బిజీ’ డాక్యుమెంటరీకి గీత ఆ చిత్ర నిర్మాత క్రిస్టాలిన్‌ హాంప్టన్ తో కలిసి దర్శకత్వం వహించింది. ఇది అట్లాంటా లో ఉన్న మహిళా ఆరోగ్య కేంద్రంలో చీఫ్‌ ఆఫ్‌ సెక్యూరిటీగా పని చేస్తున్న ట్రేసీ జీవితంపై తీసిన డాక్యుమెంటరీ. ఉద్యోగులు, రోగులను కా పాడే క్రమంలో ఆమె దినచర్యలోని ఒక రోజును డాక్యుమెంటరీ నిశితంగా చూపిస్తుంది. ‘ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌’ ఒకాల (ఫ్లోరిడా)లో జూన్‌ 2023లో జరిగిన విషాద సంఘటనను చూపిస్తుంది.

రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో సుసాన్‌ లూయిస్‌ అనే తెల్లజాతి మహిళ తన ఇంటి పక్కన ఉన్న నల్లజాతి వ్యక్తి అజికే ఓవెన్ ్సను కాల్చి చంపింది. ఈ అంశాన్నే తన డాక్యుమెంటరీకి ఎంచుకున్నారామె. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ‘అమెరికాలో అమానవీయ యాజమాన్యల ధోరణులపై పోరాడాలి. అలాగే అమెరికాలో ఉన్న గన్‌ కల్చర్‌ గురించి చాలా మాట్లాడాలి. ఆ చట్టాల్లో మార్పు రావాలి. ఇవి ఒకరోజులో జరిగేవి కావు. నా డాక్యుమెంటరీలు ఈ అంశాలనే చర్చిస్తూ ఆలోచనలు రేకెత్తిస్తాయి. మార్పుకు దోహదం చేస్తాయి’ అంటారు గీత.

సహాయకురాలిగా ప్రారంభమైన కెరీర్‌
స్పైక్‌ లీ, సామ్‌ పొలార్డ్‌ల చిత్రాలకు సహాయకురాలిగా గీత  కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. స్పైక్‌ లీ నిర్మించిన డాక్యుమెంటరీలు ‘ఇఫ్‌ గాడ్‌ ఈజ్‌ విల్లింగ్‌’, ‘డా క్రీక్‌ డోంట్‌ రైజ్‌’లకు గీత ఎడిటర్‌గా పని చేశారు. గ్రేస్‌ లీదర్శకత్వం వహించిన ‘అండ్‌ షీ కుడ్‌ బి నెక్స్‌ట్‌’ చిత్రానికి ఆమె ఫీల్డ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. గీత తీసిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘త్రూ అవర్‌ ఐస్‌: అ పార్ట్‌’ సిరీస్‌ 2022లో అత్యుత్తమ షార్ట్‌ డాక్యుమెంటరీగా ఎమ్మీ అవార్డును గెలుచుకుంది.

చేజారిన పురస్కారాలు..
తాజాగా జరిగిన ఆస్కార్‌ ప్రదానోత్సవ వేడుకల్లో గీతకు రెండు విభాగాల్లోనూ పురస్కారాలు దక్కలేదు. ఉత్తమ షార్ట్‌ డాక్యుమెంటరీగా ‘ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్‌’ ఎంపిక కాగా, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘మిస్టర్‌ నోబడీ అగెనెస్ట్‌ పుతిన్‌’ ఎంపికైంది. అయినా సరే గీతలో ఏమాత్రం నిరాశ లేదు. తన పని తాను సరిగ్గా చేశానన్న ధీమా ఆమెలో వ్యక్తమవుతోంది. ఒకేసారి రెండు నామినేషన్లు పొందిన మహిళగా ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. మరిన్ని విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి.

వలస కుటుంబం నుంచి
గీతా గంద్‌భిర్‌ తండ్రి శరద్‌ 1960లలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లారు. ఫలితంగా గీత బోస్టన్‌లో పెరిగారు. ఆమె తల్లి పేరు లలిత. గీత సోదరుడు అశ్విన్‌ గంద్‌భిర్‌ కూడా చిత్రనిర్మాత, ఎడిటర్‌. డాక్యుమెంటరీ రంగంలో అమెరికాలో గీతది ప్రముఖమైన పేరు. ఇప్పటికే ఐదు ఎమ్మీ అవార్డులతో పాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement