సాక్షులకు ఏదీ భరోసా!

No Ptotection For Witnesses - Sakshi

రక్షణకు ప్రత్యేక చట్టమంటూ గతంలో ప్రకటన

విదేశాల్లో పద్ధతుల అధ్యయనానికి  నిర్ణయం

అమలుకు నోచుకోని ప్రతిపాదనలు

‘మక్కా’ కేసు వీగిపోవడం వెనుక ఇదీ ఓ కారణమే

సాక్షి,సిటీబ్యూరో: గతేడాది టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు... సోమవారం మక్కా మసీదులో పేలుడు కేసు... ఈ రెండూ వీగిపోవడానికి సాక్షులు ఎదురు తిరగడం కూడా ఓ ప్రధాన కారణం. నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించే సాక్షులకు భరోసా కల్పించడంలో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విఫలం అవుతున్నాయి. నేరాల నియంత్రణ (ప్రివెన్షన్‌),  నిందితులను పట్టుకోవడం (డిటెక్షన్‌), నిందితులను కోర్టులో దోషులుగా నిరూపించడం (కన్వెక్షన్‌)... ఈ మూడు పోలీసింగ్‌లో ప్రధాన అంశాలు. అయితే మొదటి రెండింటిలో పోలీసుల వైఫల్యం మాత్రమే ప్రధాన కారణం కాగా, మూడో అంశానికి సాక్షులు ప్రభావితం కావడం కూడా దోహదం చేస్తోంది. పోలీసులు ఎంత శ్రమించినా, ఆధారాలు సేకరించినా అనేక కేసుల్లో సాక్షులు ఎదురు తిరగడంతోనే శిక్షల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా నమోదైన కేసుల్లో 30 శాతం కూడా కోర్టుల్లో నిరూపితం కావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ 2013లో భావించింది. అయితే ఇప్పటి వరకు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 

‘ప్రత్యేక’ కేసుల్లో మాత్రమేఅదనపు చర్యలు...
ప్రతి కేసునూ పోలీసులు ఒకే దృష్టిలో చూడాల్సి ఉంది. దర్యాప్తు, ఆధారాల సేకరణతో పాటు సాక్షుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్‌ ఇవ్వడం, భద్రతపై భరోసా కల్పించడం, న్యాయస్థానానికి ధైర్యంగా హాజరై సాక్ష్యం చెప్పేలా చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసు విభాగంలో సిబ్బంది కొరత నేపథ్యంలో అధికారులపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి గరిష్టంగా 60 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగలిగే దర్యాప్తు అధికారులు కనిష్టంగా 200 కేసులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగా వీటిలో సాక్షులు ఎవరన్నది గుర్తుపెట్టుకోవడం, తరచూ వారిని సంప్రదించడం సాధ్యం కావట్లేదు. కేవలం కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యం కలిగి ఉన్న వాటిలో మాత్రమే పోలీసు అధికారులు సాక్షుల కోణం పైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు ఉండాలన్న వాదన ఏళ్లుగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

‘నిద్రలేపిన’ జెస్సికా కేసు...
సాక్షుల రక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఆలోచన కలగడానికి ప్రధాన కారణం జెస్సికాలాల్‌ కేసే. ప్రముఖ మోడల్స్‌లో ఒకరైన జెస్సికా 1999 ఏప్రిల్‌ 29న ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక మంది వీఐపీలతో ముడిపడిన దీని విచారణే కేంద్రం కళ్లు తెరిపించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై నేరం నిరూపించడం కోసం 101 మంది సాక్షులను ఎంపిక చేశారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా... ఏకంగా 32 మంది ఎదురు తిరిగారు. దీనికి ప్రధాన కారణం నిందితుల తరఫున కొందరు రంగంలోకి దిగి సాక్షులను భయపెట్టడం ద్వారా ప్రభావితం చేసినట్లు గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్ర హోం శాఖ కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది. 

అటకెక్కిన అంతర్జాతీయ అధ్యయనం..
సాక్షి రక్షణ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అంతర్జాతీయంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్దతులు, చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వీటన్నింటిలోంచి ఉత్తమ పద్దతులను క్రోడీకరించి, మన దేశంలో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణలోని తీసుకుంటూ ప్రత్యేక చట్టం రూపొందించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేతులు మారడంతో ప్రతిపాదనల స్థాయిలోనే ఈ చట్టం అటకెక్కింది. ఇది అమలులోకి వస్తే ప్రతి కేసులోనూ సాక్షుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉండేది. ఫలితంగా శిక్షల శాతం పెరిగి నేరాలు సైతం తగ్గుముఖం పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని మర్చిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫలితంగా సాక్షులకు భరోసా లేక అనేక కేసులు వీగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top