సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిపై దృష్టిపెడితే తెలంగాణ ఏర్పాటు అవసరమే ఉండేది కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మేడే ఉత్సవాల్లో హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. గడ్డాలు పెంచుకునేటోళ్లు (ఉత్తమ్‌కుమార్ రెడ్డి), పాటకీలు పగులగొడ్తామని (టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం) ప్రగల్భాలు పలికేటోళ్లు సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారన్నారు. ప్రగతిభవన్‌పై కొంతమంది విమర్శలు చేస్తున్నారని..ఒక్కొక్కరంగానికి చెందిన ఉద్యోగులను, కార్మికులను ప్రగతిభవన్‌కు ఆహ్వానించి, అన్నం పెట్టి జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు.
ప్రగతి నిరోధకులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని స్పష్టం చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ..అసంఘటిత కార్మికులపై బుధవారం నుంచి సర్వే చేయిస్తున్నామని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల వల్ల 50 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికే ఒకాయన పార్టీ పెట్టిండని ఆయన వెనుక ఎవరూ లేరని ప్రజలు తమ వెంటే ఉన్నారని నాయిని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తున్న మంత్రులు నాయిని,కేటీఆర్. చిత్రంలో మేయర్ రామ్మోహన్
కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలేరు
May 2 2018 3:19 AM | Updated on Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement