నో హారన్‌ ప్లీజ్‌...

No horn please  - Sakshi

ఈ నినాదం ఎన్నో వాహనాల వెనుక రాసి ఉంటుంది.. కానీ పాటించేదెవ్వరు? ఈయన పాటిస్తున్నాడు.. 18 ఏళ్లుగా! నోరెళ్లబెట్టారా? రోజూ హారన్‌ కొట్టికొట్టి వాహనాలు నడిపే.. మనలాంటి వాళ్లకు ఇలాంటోళ్లను చూస్తే.. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మరి.. అందుకే ఈయనకు ఆ మధ్య ‘మానుష్‌ సన్మాన్‌’ అనే పురస్కారాన్ని కూడా ఇచ్చారు. ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు కదూ.. పేరు.. దీపక్‌ దాస్‌.. కోల్‌కతాలో ఉంటారు.

శబ్ధ కాలుష్యంలో ఈ హారన్లదీ కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసినా.. మరో వాహనం మనకు దగ్గరగా వచ్చినా.. హారన్‌తో ఓసారి హెచ్చరిస్తాం. ‘హారన్‌ల వల్ల శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది. నో హారన్‌ పాలసీని అనుసరించడం ద్వారా డ్రైవర్‌ మరింత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతాడు. టైమింగ్, వేగం, ఎంత స్పేస్‌ ఉందన్న విషయంపై తగిన అవగాహన ఉంటే చాలు.. హారన్‌తో పనే లేదు’ అని దీపక్‌ దాస్‌ చెబుతారు. కారు డ్రైవర్‌గా పనిచేసే దీపక్‌.. ట్రాఫిక్‌ జామ్‌ ఉన్నప్పుడు తన కస్టమర్లు హారన్‌ ఉపయోగించాలని కోరుతుంటారని.. తాను సున్నితంగా తిరస్కరిస్తుంటానని తెలిపారు.

దూర ప్రయాణాల విషయంలోనూ తనది ఇదే పాలసీ అని చెప్పారు. తన స్ఫూర్తితో కొంతమందైనా డ్రైవర్లు మారితే చాలన్నారు. తమ వినూత్న ప్రతిభ ద్వారా సమాజానికి మంచి చేసే వ్యక్తులను ‘మానుష్‌ మేలా’ అనే సంస్థ ఏటా మానుష్‌ సన్మాన్‌ అవార్డుతో సన్మానిస్తుంది. దీపక్‌ గతంలో పలువురు ప్రముఖులతోపాటు పలు సంస్థల్లో డ్రైవర్‌గా పనిచేశారని.. అందరినీ కనుక్కున్నాకే.. పూర్తిస్థాయి పరిశీలన అనంతరమే.. దీపక్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సదరు సంస్థ ప్రతినిధులు చెప్పారు.    – సాక్షి, తెలంగాణ డెస్క్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top