నాన్నలాంటి నాయకుడికి మరణం లేదు: షర్మిల | No death to Ys rajashekar reddy like a political leader, says Sharmila | Sakshi
Sakshi News home page

నాన్నలాంటి నాయకుడికి మరణం లేదు: షర్మిల

Jan 22 2015 1:57 AM | Updated on Oct 16 2018 8:50 PM

నాన్నలాంటి నాయకుడికి మరణం లేదు: షర్మిల - Sakshi

నాన్నలాంటి నాయకుడికి మరణం లేదు: షర్మిల

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, ఒక నాయకుడిగా కాకుండా కన్నతండ్రిలా పాలన సాగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు.

* నల్లగొండ ‘పరామర్శ యాత్ర’లో షర్మిల
* ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న వైఎస్సార్
* మనిషిని మనిషిగా చూశారు.. పేదవాడిని గౌరవించిన నేత
* రైతులు, రైతు కూలీలకు అండగా నిలిచిన మహామనిషి
* తన ఐదేళ్ల పాలనలో ఏనాడూ ఏ చార్జీలు పెంచలేదు
* కుల, మత, వర్గ భేదం లేకుండా ఆదరించిన నాయకుడు
* ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సింది మనమే..
* రాజన్న రాజ్యం కోసం చేయిచేయి కలిపి సాగుదామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి పిలుపు
* దేవరకొండ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ

 
సాక్షి, నల్లగొండ/హైదరాబాద్: తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, ఒక నాయకుడిగా కాకుండా కన్నతండ్రిలా పాలన సాగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన వైఎస్సార్ లాంటి నాయకుడికి మరణం లేదని, తెలుగు జాతి బతికి ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆమె చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిల దేవరకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ముగ్గురి కుటుంబాలను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, దేవరకొండల్లో తనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలనే విధంగా పాలించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.
 
మనిషిని మనిషిగా చూసి, పేదవాడిని కూడా మనస్ఫూర్తిగా గౌరవించిన కారణ ంగానే రాజన్నగా పిలిపించుకున్నారని.. అలాంటి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకునేందుకు అందరం చేయిచేయి కలిపి ముందుకెళదామని పిలుపునిచ్చారు. అంతకుముందు షర్మిల నల్లగొండ పర్యటనకు హైదరాబాద్ నుంచి ఉదయం 9.40కి బయలుదేరారు. లోటస్‌పాండ్‌లో తమ నివాసంలో తల్లి వైఎస్ విజయమ్మ, సోదరుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ఆశీర్వదించి, వాహనం వద్దకు వచ్చి పర్యటనకు పంపారు. నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే...
 
 ‘‘వైఎస్‌ను ఎంతగానో అభిమానిస్తూ.. నన్ను చూడడానికి వచ్చిన అందరికీ మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. ఒక నేత మరణిస్తే ఆ బాధతో వందలాది మంది ప్రాణాలు విడవడం దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. ఒక్క వైఎస్సార్ మరణించినప్పుడు మాత్రమే అలా జరిగింది. మనసున్న నాయకుడిగా ప్రజలు ఆయన్ను గుండెల్లో దాచుకున్నారు కాబట్టే వైఎస్సార్ మరణించినప్పుడు రాష్ట్రంలో వందలాది గుండెలు ఆగిపోయాయి. జన్మనిచ్చిన తల్లి, నడక నేర్పిన నాన్న, తోడబుట్టిన వారికి, ఆత్మ బంధువులకు జీవితాంతం గుండెల్లో చోటిస్తాం.. అలాంటి చోటు వైఎస్సార్‌కు కోట్లాది మంది ప్రజలు ఎందుకిచ్చినట్టు? కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎందుకు బతికి ఉన్నట్టు? రాష్ట్రానికి నేతగా కాకుండా కన్నతండ్రిలా ప్రజలను చూసుకున్నందుకే  ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత ఆయన సొంతం.  వైఎస్సార్ ప్రతి రైతుకు, రైతు కూలీలకు అండగా నిలబడ్డారు.

రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధర అందించిన ఘనత ఆయనది. పేదరికంతో డబ్బులేని కారణంగా పిల్లల చదువు ఆగిపోకూడదని, డాక్టర్ చదువుతారో, ఇంజనీర్ అవుతారో, ఎంబీఏ, ఎంసీఏ చదువుతారో.. ఏదైనా ప్రభుత్వమే చదివిస్తుందన్న వైఎస్ భరోసాతో లక్షలాది మంది చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని మంచి మనసుతో ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి.. లక్షలాది మందికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. ‘కుయ్.. కుయ్.. కుయ్’మంటూ ప్రమాదం జరిగిన నిమిషాల్లోపే వచ్చిన ‘108’ అంబులెన్సులు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. ఇన్ని చేసినా పేదలపై భారం పడకూడదని ఐదేళ్లలో ఒక్క రూపాయి కరెంటు చార్జీలు గాని, బస్సు చార్జీలుగానీ పెంచలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలూ ఆయనను విమర్శించలేకపోయాయి. అందుకే ఆయన రికార్డు సీఎంగా నిలిచారు. వైఎస్సార్ పాలించిన ఐదేళ్లలో దేశం మొత్తమ్మీద అన్ని రాష్ట్రాల్లో 46 లక్షల పక్కాగృహాలు నిర్మిస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు. రచ్చబండకెళ్లి ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే చేతులు లేపే వారు ఉండకూడదని వైఎస్ చెబుతుండేవారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఒక్క పూరిగుడిసె ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఎకరానికి నీళ్లు ఉండేవి.
 
 ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేది. బిడ్డలకు, చదువులు ఉద్యోగాలు ఉండేవి. తన, పర భేదం లేకుండా ప్రతి వర్గం ప్రజలకు, ఏ కులం, ఏ మతం అని చూడకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయగలిగాడు వైఎస్సార్. ఆయన ఆశయాలను మన మే ముందుకు తీసుకెళ్లాలి. ఆయన పథకాలను కొనసాగించుకోవాలి. అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి కలపాలి..’’ అని షర్మిల పేర్కొన్నారు. యాత్రలో ఆమె వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, వడ్లోజు వెంకటేశం, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, బీష్య వీరేందర్, షర్మిలా సంపత్, సిద్ధార్థరెడ్డి తదితరులు ఉన్నారు.  
 
 ఆత్మీయ పరామర్శ...
 వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను స్వయంగా వచ్చి ఓదారుస్తానని మాట ఇచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతినిధిగా వచ్చిన షర్మిల ఆత్మీయ పరామర్శతో మూడు కుటుంబాలు పులకించాయి. ముందు దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలం మదనాపురంలో ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని, తర్వాత చందంపేట మండలం దేవచర్లలో కేతావత్ హనుమంతునాయక్ కుటుంబాన్ని, అనంతరం అదే మండలం గువ్వలగుట్టలో రమావత్ బీమిని కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆ కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పలకరించారు. ‘పెద్దాయనా.. ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటమ్మా.. అందరూ బాగున్నారా? కాలువాపు ఎందుకు వచ్చింది? రేషన్ వస్తుందా అమ్మా..? పిల్లలూ బాగా చదువుకోవాలి.. మీకు అండగా మా కుటుంబం ఉంటుంది.’ అంటూ షర్మిల మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. షర్మిల కూడా తమ కుటుంబసభ్యురాలే అన్న అనుభూతికి వారు లోనయ్యారు. హనుమంతునాయక్ కుటుంబాన్ని పరావ ుర్శిస్తున్న సమయంలో ఆయన కుమారుడు ధరంసింగ్, మనుమరాలు ప్రియాంక ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. వారిని షర్మిల ఓదార్చి భరోసానిచ్చారు. బీమిని మనుమరాలు పద్మ తన కుటుంబ పరిస్థితిని కన్నీళ్లు పెట్టుకుంటూ షర్మిలకు వివరించారు.
 
 వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత షర్మిలకు ఆత్మీయతతో పెరుగన్నం తినిపించారు. యాత్ర పొడవునా షర్మిలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చందంపేట మండలంలోని మారుమూల ప్రాంతమైన గువ్వలగుట్టకు వెళుతున్న సమయంలోనూ స్థానిక గిరిజనులు తమ గ్రామాల్లో ఆమెను ఆపి మాట్లాడారు. రాజశేఖరరెడ్డి కుమార్తె తమ ఊరికి వచ్చిందని చెప్పుకుంటూ మురిసిపోయారు. మంగళహారతులు, గిరిజన మహిళలు నృత్యాలతో షర్మిలను స్వాగ తించారు. గువ్వలగుట్టలో పరామర్శ కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి ఏడున్నర అయినా గ్రామస్తులు ఆమె కోసం ఉండిపోవడం.. షర్మిలను చూస్తుంటే రాజశేఖరరెడ్డి గుర్తుకువ స్తున్నాడని వ్యాఖ్యానించడం వైఎస్ కుటుంబంపై ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement