నిజామాబాద్‌లో.. కుల రాజకీయం !

Nizamabad lok Sabha Elections Are Depending Upon Community Committees - Sakshi

కుల సంఘాల్లో పట్టు కోసం పార్టీల ప్రయత్నం 

వివిధ కులాల పెద్ద మనుషులతో చర్చలు సాగిస్తున్న నేతలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థుల ప్రయత్నం 

మోర్తాడ్‌(బాల్కొండ): పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని వివిధ గ్రామాలలో కుల సంఘాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే సత్తా కులసంఘాలపై ఉండడంతో కులాలకు గాలం వేసే పనిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్, బోధన్, నిజామాబాద్‌ అర్బన్, కోరుట్ల, జగిత్యాల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఈ అన్ని నియోజకవర్గాల పరిధిలో కుల సంఘాల ప్రభావం అధికంగా ఉంది. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తడం కోసం రైతులు 175 మంది పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రైతుల్లో ఎక్కువ మంది రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే రైతులు పోటీలో ఉండడంతో వారి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు తమకు రావనే ఉద్దేశ్యంతో ఇతర సామాజిక వర్గాల ఓట్ల కోసం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే వాటిలో గురడి కాపు, మున్నూర్‌కాపు, గౌడ, దళితులు, ముదిరాజ్, పద్మశాలి, ముస్లిం, యాదవ, గిరిజనులు తదితర కుల సంఘాలు ఉన్నాయి.

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల్‌ పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసేంత మెజారిటీ ఓటర్లు వైశ్యులలో ఉన్నారు. ఈ కుల సంఘాల పెద్దమనుషులతో చర్చలను సాగిస్తున్న నాయకులు కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల మద్దతును కూడగట్టుకుంటే ఎక్కువ ఓట్లను రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. కుల సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలను చేయిస్తున్నారు. ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నం వారు చేశారు.

కుల సంఘాలను తమవైపు తిప్పుకుంటే సభలు, సమావేశాలకు జన సమీకరణ సులభంగా ఉండడమే కాకుండా ఎన్నికల్లో గెలుపు సునాయసం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా అందరికి కులసంఘాలు జై కొడుతున్నాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top