నిమ్స్‌లో నిర్లక్ష్యం! | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో నిర్లక్ష్యం!

Published Sat, Apr 18 2020 8:23 AM

NIMS Hospital Staff Negligence on Social Distance - Sakshi

లక్డీకాపూల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యసేవలను అందించే నిమ్స్‌ ఆస్పత్రి మాత్రం  నిబంధనలను పాటించడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, హెల్త్‌ కేర్‌ సిబ్బందికి భద్రత కల్పించే విషయంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు  వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ విభాగంలో పని చేసే ముగ్గురు వైద్యులను, నలుగురు నర్సులను హోం క్వారంటైన్‌కు సిఫార్సు చేసిన సంగతి  తెలిసిందే. వీరిలో ఓ నర్సుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో యాజమాన్యం ఔట్‌ పేషెంట్లకు  కరోనా స్క్రీనింగ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఈ తరుణంలో వైద్యులకు, సిబ్బందికి తగిన విధంగా భధ్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా విధులకు హాజరయ్యే విషయంలో  సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో సిబ్బంది రాకపోకలకు గానూ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు మేఘ ఇంజనీర్స్‌ సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించింది. దాంతో నగర వ్యాప్తంగా  ఉన్న నిమ్స్‌ సిబ్బంది సౌకర్యార్థం ఏడు రూట్లు విభజించి అందుకు అనుగుణంగా బస్సు సదుపాయాన్ని కల్పించింది. దీంతో పాటుగా టీఎస్‌ ఆర్టీసీ కూడా మరో రెండు బస్సులను సమకూర్చింది. అయినప్పటికీ మూడు షిఫ్ట్‌లు విధులను నిర్వహించే నిమ్స్‌ సిబ్బంది సంఖ్యకు తగిన విధంగా బస్సులను సమకూర్చకపోవడంతో సిబ్బంది సామాజిక దూరాన్ని  పాటించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక బస్సులను కూడా సర్వీసు  బస్సులుగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసు అయిన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో విధులకు వస్తున్నామని, అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడంతో పాటుగా వర్కర్లకు మాస్క్‌లు, గ్లౌస్‌లు, హెల్త్‌కేర్‌ సిబ్బందికి పీపీఇ కిట్లను  అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

Advertisement
Advertisement