పావురాల ముట్టడి

Nifa Virus Spread Through Pigeon - Sakshi

హైదరాబాద్‌లో 6 లక్షలకు చేరిన కపోతాలు..

పట్టించుకోకుంటే నిఫా తరహా ప్రమాదం: నిపుణులు

వాటి విసర్జితాల వల్ల ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం

చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతినే అవకాశం

డాక్టర్‌ వాసుదేవరావు బృందం అధ్యయనం హెచ్చరిక

త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న బృందం

విదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం

  •  శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు.
  •  రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది.
  •  భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగర సంస్కృతిలో భాగమైన శాంతి కపోతాలు... ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నా యి! ఆహ్లాదం కోసమో లేక పుణ్యం వస్తుందనో నగరవాసులు పెంచుకునే పావురాలు వారికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి!! ప్రస్తుతం కేరళను వణికిస్తున్న ప్రాణాంతక నిఫా వైరస్‌ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమా దం పొంచి ఉందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించింది. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని పేర్కొంది. ఈ ఇన్‌ఫెక్షన్లతో
చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని అధ్యయనం తేల్చి చెప్పింది. 

నగరంలో భారీగా పావురాలు... 


           డాక్టర్‌ వాసుదేవ రావు
హైదరాబాద్‌లో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారి అధ్యయనం జరుపుతోంది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవరావు హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయన ప్రాథమిక వివరాలను 2017లో ‘సాక్షి’ తొలిసారి ప్రజల ముందుకు తెచ్చింది. అయితే ఈ రెండేళ్లలో పావురాల సంఖ్య లక్ష వరకు పెరిగిందని, వాటి సంఖ్యను వెంటనే నియంత్రించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు సూచిస్తున్నారు. లేదంటే నిఫా వైరస్‌ కలకలంతో కేరళవాసులు ఎలా భయపడుతున్నారో హైదరాబాద్‌వాలసులు పావురాలను చూసి వణికిపోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరలో తమ అధ్యయనాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అధ్యయనం తుది అంకంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ సాయంతో ప్రత్యేక వివరాలను సేకరించనున్నారు.
 
విదేశాల్లో నిషేధం... మన దగ్గర ప్రాథమిక వివరాలే కరువు... 

సెంట్రల్‌ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడాన్ని నిషేధించారు. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ సెంట్రల్‌ లండన్‌ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి తాజాగా ఆయా ప్రాంతాల్లో నిషేధాన్ని విధించటమే కాకుండా గట్టిగా అమలుకు నిర్ణయించింది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. సింగపూర్‌ లాంటి నగరాలు కూడా జరిమానా హెచ్చరికలతో ప్రజలను కట్టడి చేస్తున్నాయి. దాణా వేస్తుండటం వల్లే పావురాల సంఖ్య భారీగా పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోందని గుర్తించిన పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం విధిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. 

పావురాల విసర్జితాలతో ప్రాణహాని ఇలా... 

పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీన్ని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి ఉండటం, కొద్దిరోజులకే అది పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని  నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు పేర్కొన్నారు. అయితే అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించడం లేదని, వాటిని ఇంకా పెంచుతూనే ఉన్నారని ఆయన చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలను దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే యావత్‌ హైదరాబాద్‌ జబ్బు పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top