కొలిక్కిరాలే !

New Zilla Parishad Office Not Ready In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్లు.. చైర్మన్లు.. వైస్‌ చైర్మన్లు.. జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు ఎవరో తేలిపోయారు. వచ్చే నెల ఐదో తేదీన మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా పరిషత్‌లు కొలువుదీరనున్నాయి. అదే రోజు నుంచి ఆయా పరిషత్‌లలో పాలన ప్రారంభం కానుంది. కానీ.. కొత్తగా కొలువుదీరిన జిల్లాల్లో పరిషత్‌ కార్యాలయాల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. కనీసం కొత్త పరిషత్‌ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కేటాయింపు జరగలేదు. మిగిలిన పక్షం రోజుల్లో జెడ్పీ భవనాల ఖరారు.. ఉద్యోగుల నియామకాలు అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలు, భవనాల ఎంపికకు సంబంధించి ఈనెల 15న పంచాయతీరాజ్‌ కమిషనర్‌తో జెడ్పీ సీఈఓలతో జరగాల్సిన సమావేశం రద్దు కావడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమావేశం తర్వాతే భవనాల ఖరారు, ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జెడ్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అరకొర సదుపాయాల మధ్య కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయనే భావన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. అలాగే జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, చైర్మన్లు, సీఈఓలకు ప్రభుత్వం కొత్త వాహనాలు కేటాయించింది. ఈ వాహనాలు ఈ నెలాఖరులోగా ఆయా జిల్లాలకు చేరుకుంటాయని సమాచారం.
 
∙కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో 64 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా చారగొండ, పదర, మూసాపేట, రాజాపూర్, మదనాపురం, చిన్నంబావి, మరికల్, మహబూబ్‌నగర్‌ రూరల్, కృష్ణ, ఊర్కొకొండ, పెంట్లవెల్లి, రాజోలి, ఉండవెల్లి, కేటీ దొడ్డి, రేవల్లి, శ్రీరంగాపురం, అమరచింత మొత్తం 17 మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో మండలాల సంఖ్య 81కు చేరింది. అదే సమయంలో పది మండలాలు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కలిశాయి. దీంతో ఉమ్మడి పాలమూరు 71 మండలాలకు పరిమితమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటు చేశారు. 15 మండలాలతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఏర్పాటు కాగా 11 మండలాలతో నారాయణపేట, 20 మండలాలతో నాగర్‌కర్నూల్, 12 మండలాలతో జోగులాంబ గద్వాల, 14 మండలాలతో వనపర్తి జిల్లా ఏర్పాటైంది. తాజాగా గత నెలలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. వచ్చే నెల నాలుగో తేదీన ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. మరుసటి రోజే ఎన్నికయిన కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.

గడువులోగా గగనమే...! 
కొత్తగా కొలువుదీరిన జిల్లా పరిషత్‌ కార్యాలయాల్లో ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కనీసం భవనాలు సైతం ఖరారు కాలేదు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో పరిషత్‌ కార్యాలయాల భవనాలు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో భవనాలు లేకపోవడంతో బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయ భవనాన్ని జెడ్పీకి కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అటు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రాల్లో నూతనంగా నిర్మించిన మండల పరిషత్‌ భవనాలు, నారాయణపేటలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం జిల్లా పరిషత్‌ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వాన్ని నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత భవనాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. 

ఐదు జిల్లా పరిషత్‌లు.. 60 మంది ఉద్యోగులు  

కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల విభజన, కేటాయింపుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఏ ప్రాతిపదికన జరుగుతుందో అనే ఉత్కంఠ ఆయా ఉద్యోగుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పని చేస్తోన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీలకు సమానంగా విభజించాలని ప్రాథమికంగా> నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు డీప్యూటీ సీఈఓలున్నారు. వీరందరికీ కొత్త జిల్లా పరిషత్‌లకు ఇన్‌చార్జ్‌ సీఈఓలుగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో మొత్తం 60మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్‌లు ఉండగా మహబూబ్‌నగర్‌ జెడ్పీకి ముగ్గురిని, మిగిలిన నాలుగు జెడ్పీ కార్యాలయాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించాలని నిర్ణయించారు.

13మంది సీనియర్‌ అసిస్టెంట్లు ఉండగా నాగర్‌కర్నూల్‌కు నలుగురు, మహబూబ్‌నగర్‌కు ముగ్గురు, మిగిలిన మూడు జెడ్పీలకు ఇద్దరి చొప్పున కేటాయించనున్నారు. 21 మంది జూనియర్‌ అసిస్టెంట్లలో మహబూబ్‌నగర్‌కు తొమ్మిది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ముగ్గురి చొప్పున, ఉన్న ఐదుగురి టైపిస్ట్‌లలో ఒక్కొక్కరికి ఒక్కో జెడ్పీకి, 14 మంది అటెండర్లలో మహబూబ్‌నగర్‌ జెడ్పీ కార్యాలయానికి పది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ఒక్కొక్కరి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకే ఉద్యోగుల విభజన జరగనుంది. అలాగే.. ప్రస్తుతం ఉమ్మడి జెడ్పీ కార్యాలయంలో అటెండర్‌ మొదలు డిప్యూటీ సీఈఓలుగా పని చేస్తోన్న అందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలుండడంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top