పోలీస్‌ @ అప్‌డేట్‌

New Policy implemented In Police Department In Nizamabad - Sakshi

అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకోవడం జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా 15 వేల పోలీస్‌స్టేషన్లు, ఐదు వేలకు పైగా పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలను అనుసంధానించేలా చేపట్టిన  సీసీటీఎన్‌ఎస్‌ వంటి ప్రాజెక్టులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరింత అవగాహన కల్పించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఏసీపీ, డీఎస్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు.

సాక్షి, నిజామాబాద్‌ : అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఇటీవల నిజామాబాద్‌ నగరం నడిబొడ్డున స్వైర విహారం చేసింది. నగరంలోని జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడి., వాహనంలో దర్జాగా నవీపేట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వాహనాన్ని వదిలేసి ద్విచక్ర వాహనాలపై సమీపంలో ఉన్న మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తరచూ ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్న పక్కా ప్రొఫెషనల్స్‌ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడం జిల్లా పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి వివరాలు, కదలికలు జిల్లా పోలీసులకు అంతుచిక్కడం లేదు.

ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడే సీసీటీఎన్‌ఎస్‌ (క్రిమినల్స్, క్రైం ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం) ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 15 వేల పోలీస్‌స్టేషన్లు, ఐదు వేలకు పైగా పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలను అనుసంధానించేలా చేపట్టిన సీసీటీఎన్‌ఎస్‌ వంటి ప్రాజెక్టులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు మరింత అవగాహన కల్పించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారులకు అధునాతన టెక్నాలజీపై రెండు రోజుల పాటు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరగనున్న అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి.  

ఇప్పటికే టీఎస్‌కాప్‌ వినియోగం..
ఇప్పటికే టీఎస్‌ కాప్, సీసీటీఎన్‌ఎస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, పోలీసు అధికారులు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ఆ శాఖ చర్యలు చేపట్టింది. సిబ్బందికి టెక్నాలజీకి సంబంధించి అవగాహన కల్పించారు. తాజాగా మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అప్‌డేట్స్‌పై ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. పోలీసుశాఖ వినియోగిస్తున్న టీఎస్‌కాప్‌ వంటి ప్రత్యేక యాప్‌తో వాహన తనిఖీలు చేసినప్పుడు, అనుమానాస్పద వాహనాల వివరాలను ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి ప్రతిరోజు విడుదలవుతున్న వారి వివరాలను కూడా ఆన్‌లైన్‌లో చూసుకునేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు.

తద్వారా తరచూ నేరాలకు పాల్పడే స్వభావం కలిగిన వారి కదలికలపై, ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలు జరుగుతున్న ప్రాంతాలను ఆన్‌లైన్‌లో పొందుపరడం ద్వారా ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాల (క్రైంప్రోన్‌ ఏరియాలు)పై, తరచూ ఒకేచోట దొంగతనాలు, దాడులు, హత్యలు జరుగుతున్న ప్రాంతాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీసులు నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుంది. ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. అలాగే 2002 నుంచి నమోదైన కేసుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక యాప్‌లో గన్‌లైసెన్సులు, క్రిమినల్‌ ఆల్బమ్, కోర్టు కేసుల వివరాలు ఇలా అన్ని అంశాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top