పోలీసులకు కొత్త పాఠాలు

New lessons for the police - Sakshi

సిలబస్‌లో స్వల్ప మార్పులు 

యాప్స్, ఐటీలో ప్రత్యేక శిక్షణ 

సైబర్‌ నేరాల ఛేదనకు ఉపయుక్తం 

సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసులకు బోధించే సిలబస్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలపై కొత్తగా డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చేవారికి అవగాహన కల్పించేందుకు ఇప్పుడున్న సిలబస్‌కు కొన్ని పాఠ్యాంశాలు చేర్చనున్నారు. కొన్నేళ్లుగా టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న పోలీసు శాఖ ఇపుడు పలు రకాల యా ప్స్, సోషల్‌ మీడియా విభిన్న వేదికల ద్వారా ప్రజలతో మమేకమవుతోంది. ఈ సాంకేతికత ఆధారంగా పలు చిక్కుముడులున్న కేసులెన్నో పోలీసులు ఛేదిస్తున్నారు. అందుకే, కొత్త బ్యాచ్‌ పోలీసుల్లోనూ సాంకేతికతపై మంచి పట్టు వచ్చేలా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేశారు. టెక్నాలజీపై పట్టుచిక్కితే నేరాల చిక్కుముడులు విప్పడం సులభతరంగా మారుతుందన్న ఉన్నతాధికారుల ఆలోచన మేరకు ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

ఏయే అంశాలుంటాయి? 
ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలపై పోలీసులకు అవగాహన అవసరం. ఇప్పటికే పోలీసు శాఖలో హాక్‌ఐ, దర్పణ్, టీఎస్‌ృకాప్‌ తదితర యాప్‌ల వినియోగం పెరిగింది. చలానాలు మొదలు కేసు దర్యాప్తు, నిందితుల గుర్తింపు వరకు అంతా యాప్‌ల ద్వారానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా శిక్షణ తీసుకోనున్న రానున్న దాదాపు 16,925 మంది కానిస్టేబుళ్లు, 1,250 మంది ఎస్సై ర్యాంకు అధికారులకు ఈ కొత్త సిలబస్‌ బోధించనున్నారు. థియరీతో పాటు, ప్రాక్టికల్స్‌కు కూడా అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. గతంలో ఉన్న సిలబస్‌కు అదనంగా ఐటీ తరగతులు, ప్రాక్టికల్స్‌ చేరుతాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే వీరికి కావాల్సిన సిలబస్‌ రూపకల్పన, టైం టేబుల్‌ పూర్తి చేశారు. ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో ట్రైనీ పోలీసులకు తరగతులు ప్రారంభం కానున్నాయని సమాచారం. 

పాత జిల్లాల ప్రకారమే నియామకాలు..
ఇప్పటికే పోలీసు నియామక ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా వివిధ తుది రాతపరీక్షల్లో అర్హత సాధించిన 1.2 లక్షల మందికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 కేంద్రాల్లో ఇప్పటికే సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. నోటిఫికేషన్‌ ప్రకారం.. నియామకాలు పాత జిల్లాల ప్రకారమే జరుగుతాయని చెప్పినా.. ఇప్పటికీ అభ్యర్థుల్లో కొంత గందరగోళం ఉంది. కానీ ఈ విషయంలోనూ అధికారులు మరోసారి స్పష్టతనిచ్చారు. ఈసారి నియామకాలు పాత జిల్లాల ప్రకారమే జరగనున్నాయి. వచ్చే దఫా నియామకాల్లోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే.. దానికి అనుగుణంగా నియామకాలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top