జాతీయ రహదారిగా  హైదరాబాద్‌– బీజాపూర్‌ రోడ్డు 

The national highway is Hyderabad- Bijapur road - Sakshi

విస్తరణకు 90 ఎకరాల భూసేకరణ

బైపాస్‌లో భూమి కోల్పోనున్న 120 మంది

భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి

పరిహారం విషయంలో స్పష్టత కరువు

చేవెళ్ల: హైదరాబాద్‌–బీజాపూర్‌ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించడంతో ఆ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 60 కిలోమీటర్ల పరిధిని ఒక భాగంగా.. మన్నెగూడ నుంచి మరో భాగంగా విభజించారు. విస్తరణకు మొదటి దశలో రూ.400 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో భాగంగా పోలీస్‌ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డులో 16 అండర్‌పాస్‌లు, రెండు బైపాస్‌లు, ఒక టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి భూసేకరణ పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది.  

బైపాస్‌తో భూములు కోల్పోనున్న రైతులు   
చేవెళ్ల వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మించేందుకు చేవెళ్ల, కేసారం, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి గ్రామాలకు చెందిన 120 మందికిపైగా రైతులకు సంబంధించిన దాదాపు 90 ఎకరాల పట్టా భూములు కోల్పోతున్నారు. ఇందులో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌తో భూముల ధరలు ఆకాశాన్నంటినా.. పొలాలను అమ్మకుండా కాపాడుకుంటున్న రైతులు ఇప్పుడు రోడ్డు విస్తరణలో భూములు పోతుండడంతో అయోమయంలో పడ్డారు. తమ బతుకులను అన్యాయం చేసే రోడ్డు తమకొద్దని అంటున్నారు. రోడ్డు విస్తరణలో మొత్తం 60 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 450 ఎకరాల భూమి అవసరం ఉందని అధికారులు గుర్తించారు.  

స్పష్టత ఇవ్వని అధికారులు 
నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా భూముల సేకరణకు సంబంధించి రైతులకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందుతుందని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం తమకు పరిహారం వద్దు.. భూమికి బదులు భూమి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధికారులు అంగీకరపత్రాలపై సంతకాలు చేయాలంటూ రైతుల వద్దకు వెళ్తున్నారు.  

సర్వం కోల్పోతున్నాం.. 
బైపాస్‌ రోడ్డులో నా రెండు ఎకరాల భూమి పోతుంది. నాలుగు ఎకరాలు ఉంటే అందులో మధ్య నుంచి రోడ్డు పోవడంతో రెండు ఎకరాలు భూమిపోతుంది. దీంతో ఉన్న రెండు ఎకరాలు రోడ్డుకు ఇరువైపులా మిగులుతుంది. వ్యవసాయ బావి పోతుంది. ఎలా బతకాలి.  
    – గుడిసె రాములు, బాధిత రైతు, చేవెళ్ల 

చట్ట ప్రకారం భూసేకరణ  
చట్ట ప్రకారమే భూసేకరణ చేస్తున్నాం. ఇప్పటికే రైతుల వివరాలతో ప్రకటనలు విడుదల చేశాం. చట్ట ప్రకారం రైతులకు పరిహారం వస్తుంది.  అది రెండితలా, మూడింతలా అనేది నిబంధనల ప్రకారం ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా పోరాడవచ్చు. 
    – వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, చేవెళ్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top