సాగు విస్తీర్ణంలో ఫస్ట్‌..! 

Nalgonda Stands First In Cultivation  - Sakshi

కానీ.. తలసరి ఆదాయంలో 14వ స్థానం

డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్షన్‌లో రాష్ట్రంలో 5వ స్థానం

జనాభాలో రాష్ట్రంలో 4వ స్థానం

రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించిన అంశాలు

సాక్షి, నల్లగొండ : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నిత్యం కరువు బారిన పడుతున్నా.. భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడి సాగు చేస్తున్నా.. రాష్ట్రంలో అత్యధిక సాగు విస్తీర్ణం సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో,ఎకనామిక్‌ ఔట్‌లుక్‌–2019) వెల్లడించిన వివరాల ప్రకారం పంటల సాగు విస్తీర్ణంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నివేదికలోని గణాంకాల మేరకు జిల్లాలో 3.74లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం ఉంది.

ఇంత పెద్దమొత్తంలో వ్యవసాయం సాగవుతున్న జిల్లాలో తలసరి ఆదాయం మాత్రం తక్కువగా ఉంది. 31 జిల్లాల తలసరి ఆదాయపు గణాంకాలతో పోలిస్తే నల్లగొండ 14వ స్థానంలో ఉంది. నివేదికలోని వివరాల మేరకు.. జిల్లా తలసరి ఆదాయం రూ.1,23,431గా ఉంది. మరో వైపు డీడీపీ (డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్షన్‌ )లో మాత్రం నల్లగొండ రాష్ట్రంలో 5వ స్థానం దక్కించుకుంది. ఒక ఏడాదిలో డీడీడీ రూ.23,719కోట్లు కావడం గమనార్హం. 

రేషన్‌ దుకాణాల్లో ఫస్ట్‌
రాష్ట్రంలో అత్యధికంగా రేషన్‌ దుకాణలు ఉన్నది కూడా జిల్లాలోనే కావడం విశేషం. దుకాణాల విషయంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. జిల్లాలో ఏకంగా 991 రేషన్‌షాపులు ఉండగా, 70 అన్నపూర్ణ కార్డులు, అంత్యోదయ కార్డులు 28,918, ఆహార భద్రత కార్డులు 4,32,295 ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 4,61,283 వివిధ రకాల కార్డుల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ జరుగుతోంది.

అంగన్‌వాడీల్లో రెండో స్థానం
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలోనూ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 2018–19 గణాంకాల మేరకు జిల్లాలో అంగన్‌వాడీ ప్రాజెక్టులు 9 ఉన్నాయి. ఇది రాష్ట్రంలో రెండో అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. మొత్తం 31 మండలాలకు గాను 1830 మెయిన్‌ సెంటర్లు, 258 మినీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా జిల్లాలో 68,793 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందుతోంది. 228 మంది అంగన్‌వాడీ టీచర్లతో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న జిల్లా 1786 మంది అంగన్‌వాడీ ఆయాలతో ప్రథమ స్థానంలో ఉంది. 

వంటగ్యాస్‌ వినియోగంలో 5వ స్థానం
గడిచిన రెండేళ్లుగా జిల్లాలో వంట గ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే సుమారు నలభై వేల గ్యాస్‌ కనెక్షన్లు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. రెండేళ్లుగా వంట గ్యాస్‌ వినియోగంలో జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. 2017–18లో జిల్లాలో 3,87,377 గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, 2018–19 సంవత్సరంలో ఆ సంఖ్య 4,48,564కు చేరింది.

జిల్లా సస్యశామలం కోసం ప్రాజెక్టులు
జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు ఇక్కడ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి  చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని రెండు మండలాల పరిధిలోని 19 గ్రామాల్లో 29,169 ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నట్లు పేర్కొంది. కొత్తగా చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రకటించింది.

1983లో రూ.8090కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఏఎమ్మార్పీ ద్వారా 3లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల (ఐడీ క్రాప్స్‌)కు సాగునీరు వస్తున్నట్లు పేర్కొంది. మరో వైపు రూ.6160కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 3.4లక్షల ఎకరాలకు నీరు అందుతుందని నివేదికలో పేర్కొంది. రూ.29,965కోట్ల వ్యయంతో దామరచర్లలో చేపట్టిన 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

మరికొన్ని...!
జనాభా: అత్యధిక జనాభా ఉన్న జిల్లాల్లో నల్లగొండ నాలుగో స్థానంలో ఉంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 16,18,416 కాగా, ఇందులో పురుషులు –8.18,306, మహిళలు–8,00,110 మంది ఉన్నారు. కాగా, మొత్తం జనాభాలో గ్రామీణ ప్రాంత జనాభా 12,50,113 మంది కాగా, పట్టణ ప్రాంత జనాభా 3,68,303 మంది. ఇక, 0–06 ఏళ్ల వయస్సు (రాష్ట్రంలో 5వ స్థానం)లో 1,81,996 కాగా, బాలురు 94,926, బాలికలు 87,070 మంది. జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 978గా ఉంది. ఇది రాష్ట్రంలో 23వ స్థానం.

అక్షరాస్యత 
జిల్లాలో అక్షరాస్యత 63.75శాతం ఉంది. పురుషుల్లో అక్షరాస్యత 73.90శాతం కాగా, మహిళల్లో ఇది 53.46శాతంగా ఉంది. ఈ శాతాల ప్రకారం మొత్తం జనాభాలో అక్షరాస్యులు 9,15,742 మంది కాగా చదువుకున్న పురుషులు – 5,34,573, మహిళలు – 3,81,169 మంది. కాగా, అక్షరాస్యతలో రాష్ట్రంలో జిల్లాది 14వ స్థానం.

వర్కింగ్‌ పాపులేషన్‌ 
జిల్లా మొత్తం జనాభాలో పనిచేసే వారు (వర్కర్స్‌) సగం మంది  కంటే కూడా తక్కువ. ఈ నివేదిక మేరకు జిల్లాలో వివిధ రకాల పనులు చేసే వారు 8,06,091 మంది మాత్రమే కావడం గమనార్హం. వీరిలో వ్యవసాయదారులు – 1,58,951, వ్యవసాయ కూలీలు – 3,89,621, గృహ కార్మికులు (హౌస్‌ హోల్డ్‌)–19,633, ఇతర వర్కర్స్‌ – 2,37,886 మంది ఉన్నారు. రాష్ట్రంలో జిల్లా ఈ విషయంలో 19వ స్థానంలో ఉంది. 

లైవ్‌ స్టాక్‌ పాపులేషన్‌ 
లైవ్‌ స్టాక్‌ పాపులేషన్‌ (2012 గణాంకాలు)లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. జిల్లాలో ఆవులు, గేదెలు, గొర్లు, మేకలు, పందులు ఇతరాలు కలిసి మొత్తంగా లైవ్‌ స్టాక్‌ సంఖ్య 17,13,880. ఇందులో ఆవులు/గేదెలు 2,18,220, దున్నపోతులు – 2,99,647, గొర్లు – 8,79,990, మేకలు – 2,87,852, పందులు – 17,086, ఇతరాలు – 653గా ఉన్నాయి. కాగా, కోళ్లు (పౌల్ట్రీ) సంఖ్య 25,32,797 ఉంది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top