నేటి నుంచి నాగోబా జాతర

Nagoba Jatara Starts From Today In Adilabad - Sakshi

ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం మహాపూజలతో ప్రారంభమయ్యే రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఈ నెల 30 వరకు అధికారికంగా.. ఫిబ్రవరి 3 వరకు అనధికారికంగా జరగనుంది. మెస్రం వంశీయులు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన తిరిగి ఈ నెల 20న కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు (వడమరా)వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి గురువారం సాయంత్రం వరకు 300 ఎడ్లబండ్లు, 110 వాహనాలతో మెస్రం వంశీయులు తరలివచ్చి మర్రి చెట్టు వద్ద బస చేసి..

కాగా గురువారం తెల్లవారు జామున ఆచారం ప్రకారం మెస్రం వంశంలో మృతి చెందిన 63 మంది పేరిట ‘తూమ్‌’పూజలు నిర్వహించారు. ఈ పూజలతో చనిపోయిన వారు నాగోబా సన్నిధికి చేరుతారనేది వారి నమ్మకం. నాగోబా మహాపూజకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. మహాపూజ అనంతరం అర్ధరాత్రి మెస్రం వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని మెస్రం కోడళ్లకు వారి కుటుంబ సభ్యులు నాగోబా దర్శనం చేయించి వారి వంశ పెద్దలను పరిచయం చేయిస్తారు. ఈ కార్యక్రమంతో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ నెల 27వ తేదీన నాగోబా దర్బార్‌ ఏర్పాటు చేయనున్నట్లు మెస్రం వంశీయులు, అధికారులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top