ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఏర్పాట్లు పూర్తి
22న గిరిజన దర్బార్.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు
సాక్షి, ఆదిలాబాద్: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా ఆలయంలో అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించనుంది. 22న గిరిజన దర్బార్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.
కేస్లాపూర్ వద్ద అన్ని రకాల అభివృద్ధి పనుల కోసం రూ. 22 కోట్లు కేటాయిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి కేస్లాపూర్‌కు వచ్చే దారిలో 4 కిలోమీటర్ల పరిధిలో రూ. 15 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు ఇటీవలే భూమిపూజ చేశారు. రూ. కోటితో ఆలయ ఆవరణలో భోజనాల కోసం షెడ్‌ను నిర్మించతలపెట్టారు.
సంప్రదాయాలకు పెద్దపీట..
నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్య మాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహా ఘట్టానికి శ్రీకారం చుడుతారు. ఆ మరుసటి రోజు నుంచి మెస్రం వంశీయులు నివసించే ఏడు గ్రామాలను చుట్టిరావడం మొదలుపెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే ఏడు గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరుతారు.
పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకొని బస చేస్తారు. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్న మెస్రం వంశీయులు శనివారం ఉదయం తూమ్ (కర్మకాండ) పూజలు పూర్తి చేశారు. ఆదివారం పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని నాగోబాకు మహాపూజలు నిర్వహించడం ద్వారా జాతరను ప్రారంభించనున్నారు.


