కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి

Must Teach A Lesson To CM KCR Says BK Roy - Sakshi

మన్మోహన్‌ బాటలోనే నరేంద్ర మోదీ

పోరాటాలతోనే ప్రభుత్వరంగ పరిశ్రమలకు రక్షణ

బీఎంఎస్‌ మహాసభలో జేబీసీసీఐ సభ్యుడు బీకే రాయ్‌

సాక్షి, సింగరేణి: కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని వేజ్‌బోర్డు సభ్యుడు, జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి డాక్టర్‌ బీకే రాయ్‌ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) 26వ మహాసభ జరిగింది. ఈ సభను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీకే రాయ్‌ మాట్లాడుతూ బీఎంఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులు ఆలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ సాధనకు ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులను అణగదొక్కాలనే కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మిక వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమలను ప్రైవేటీకరించటం, అమ్మివేయడాన్ని బీఎంఎస్‌ వ్యతిరేకిస్తోందని అన్నారు. దేశంలో బీఎంఎస్‌ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, జీతభత్యాల పెంపు కోసం పోరాటాలు సాగిస్తోందని అన్నారు. ఇతర 11 జాతీయ సంఘాలు పోరాటాలు చేసినట్లు నటిస్తున్నాయని విమర్శించారు.

సమస్యల పరిష్కారానికి బొగ్గు రంగంలో ఇతర కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మె చేశాయని, బీఎంఎస్‌ మాత్రం 5 రోజుల సమ్మె చేసిందని అన్నారు. బీఎంఎస్‌ సమ్మె దెబ్బతో కేంద్ర మంత్రి దిగివచ్చి కోలిండియా సింగరేణిలో ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ప్రకటించారని అన్నారు. 1991లో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఆ విధానాలనే ప్రధానులు అటల్‌బిహారి వాజ్‌పేయి, నరేంద్రమోదీలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షింపబడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు ఈ నెల 19న బీఎంఎస్‌ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి, బూర్ల లక్ష్మీనారాయణ, మాధవ నాయక్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఏబీకేఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీర్‌గరుడే, జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేశం, దక్షిణభారత సంఘటన కార్యదర్శి సామ బాల్‌రెడ్డి, కెంగర్ల మల్లయ్య, రవిరాజ్‌వర్మ, రవిశంకర్, లట్టి జగన్మోహన్, ఎం.రమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top