
ముస్లిం రిజర్వేషన్లపై తలోమాట
రాష్ట్రంలో బీసీ-ఈ జాబితాలోని దోబీ ముస్లిం, ఫకీర్, ఫకీర్ సాయెబ్, బుడబుడ్కి, లబ్బి, లబ్బాయి, ఖురేషీ, షేక్, ముస్లిం కటిక తదితర 14 ముస్లిం బృందాలు, వర్గాలను...
- జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వాదనలు
- నిర్ణయం వెల్లడించని కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ-ఈ జాబితాలోని దోబీ ముస్లిం, ఫకీర్, ఫకీర్ సాయెబ్, బుడబుడ్కి, లబ్బి, లబ్బాయి, ఖురేషీ, షేక్, ముస్లిం కటిక తదితర 14 ముస్లిం బృందాలు, వర్గాలను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కులాల జాబితాలో చేర్చే అంశంపై శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వర్గాలు వాదనలు వినిపించాయి. రాష్ట్రంలోని బీసీ కులాలపేర్లు, అచ్చుతప్పులు, సవ రణలు తదితర అంశాలపై హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాలులో జరిగిన జాతీయ బీసీ కమిషన్ ప్రజావినతుల సేకరణ (పబ్లిక్ హియరింగ్)లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ సాగింది.
కేంద్ర జాబితాలో ఈ కులాలను చేర్చేందుకు ఇప్పటికే అందిన వివరాలు, నివేదికలు, వివిధ సంఘాల వినతులపై కమిషన్ సర్వే చేపట్టాలని అనుకూల వర్గం కోరగా, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నం దున తీర్పు వెలువడే దాకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోవద్దని వ్యతిరేక వర్గం వాదించింది. ఇరువర్గాల వాదనలను విన్న కమిషన్ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీపక్షాన, వ్యక్తిగతంగా ఆయా కులాల పక్షాన శాసనమండలిలో విపక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్‌తోపాటు ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ప్రసాద్ కుమార్ తమ వాదనలను వినిపించారు.
ఇదే అంశంపై విడిగా ఎంఐఎం పక్షాన ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేరిట రాసిన వినతిపత్రాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీలు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, అమీనుల్ హసన్‌జాఫ్రి బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు సమర్పించారు. ఈ 14 కులాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ-ఈలో చేర్చలేదని, ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తీర్పు వచ్చేవరకు దీనిపై నిర్ణయం తీసుకోవద్దని వివిధ బీసీ సంఘాలు, న్యాయవాది కొండల్‌రావు, బీసీ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య ప్రతివాదనలు వినిపించారు.
తెలంగాణలో లేని కులాల తొలగింపు
తెలంగాణ రాష్ట్రంలో లేని, ఏపీలోని ఆయా ప్రాంతాలకు పరిమితమైన ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డా.టి.రాధ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే తగిన అధికారపత్రాలు సమర్పిస్తే, పరిశీలిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కాగా, మూడు రోజులపాటు జరిగిన పబ్లిక్ హియరింగ్ శుక్రవారంతో ముగిసింది.
దేశవ్యాప్త సర్వే జరగాలి: జస్టిస్ ఈశ్వరయ్య
రాష్ట్రంలో నిర్వహించిన సకుటుంబ సర్వే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కోసం సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. 1931 తర్వాత దేశంలో కులాలవారీ వివరాలు అందుబాటులో లేవన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది మోస్ట్ బాక్‌వర్డ్‌క్లాస్ (ఎంబీసీ)కు చెందినవారున్నారన్నారు. ముస్లిం లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. సామాజిక, విద్యాపరంగా వెనుకబాటు కారణంగా రాజ్యాంగంలోని 15 (4) ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అనుభవించిన తర్వాత అభివృద్ధి చెందిన కులాలు ఈ జాబితాలోంచి తమను తొలగించాలని ఎక్కడా చెప్పడం లేదన్నారు. ఏపీలోనే గత రెండేళ్లలో 30 కులాలను చేర్చారని చెప్పారు. కృష్ణన్ కమిషన్‌కు చట్టబద్ధత లేకపోయినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
శెట్టిబలిజల్నీ గౌడ్‌లుగా గుర్తించాలి
గౌడ కులాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తున్నారని, ఈ కులాలన్నింటినీ గౌడ్‌లుగా గుర్తించాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యకు విజ్ఞప్తి చేశారు. ఏపీలోని శెట్టిబలిజలను గౌడ్‌లుగా గుర్తించాలని కోరారు.
రజకులను ఎస్సీలుగా గుర్తించాలి
రజకులు, చాకలి కులాలను ఎస్సీలలో కలపాలని తెలంగాణ రజక సంఘాల జేఏసీ.. బీసీ జాబితా నుంచి తొలగించిన బండార కులాన్ని మళ్లీ చేర్చాలని తెలంగాణ బండార కులస్తులు కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
జాతీయ బీసీ కమిషన్ సభ్యుడికి స్వైన్‌ప్లూ
నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులకు స్వైన్‌ఫ్లూ భయం పట్టుకుంది. కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య సహా సభ్యులు ఎస్‌కె కర్వెంతన్, డాక్టర్ షకీల్ ఉల్‌జమాన్ అన్సారీ, ఎస్‌కె సైనీ, మెంబర్ సెక్రట్రరీ ఏకే మంగోత్రలతో కూడిన బృందం ఈ నెల 7న హైదరాబాద్ చేరుకుంది. మూడు రోజుల నుంచి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సభ్యుల్లో ఒకరైన ఎస్‌కే సైనీ ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం తీవ్ర జ్వరం, దగ్గు, తుమ్ములు, తలనొప్పితో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించి ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య సహా మిగిలిన సభ్యులంతా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపారు. శనివారం మధ్యాహ్నానికి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. కాగా స్వైన్‌ఫ్లూ భయం తో కమిషన్ చైర్మన్ సహా సభ్యులంతా ముక్కుకు మాస్కులు ధరించి పబ్లిక్ హియరింగ్‌కు హాజరు కావడం కొసమెరుపు.