సమరానికి సై... | Municipal employees, workers strike | Sakshi
Sakshi News home page

సమరానికి సై...

Published Mon, Jun 29 2015 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

సమరానికి సై...

సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో జూలై 1 నుంచి సమ్మె చేస్తామంటూ పలు కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 16నే సమ్మె నోటీసు సైతం ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైన నేపథ్యంలో..

సోమవారం మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మొత్తం 111 మున్సిపాలిటీల్లో నిరసనలు తెలిపేందుకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. తాము జూన్ 16నే సమ్మె నోటీసిచ్చినా ప్రభుత్వం తాత్సారంపై అవి తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పురపాలక మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి.

అయితే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి.

 ప్రధాన డిమాండ్లివే... :    మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి  ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15,432 ఇవ్వాలి.  ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలివ్వాలి.
 
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు..
మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి సోమవారం నాటి చర్చల్లో ప్రభుత్వం అంగీకరించకపోతే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మె చేస్తాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం.
 -కె.ఉమామహేశ్వరరావు, జేఏసీ నాయకులు(సీఐటీయూ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement