మూడు చోట్ల రీపోలింగ్‌ 

Municipal Elections Re Polling In Three Places In Telangana - Sakshi

కామారెడ్డి, బోధన్, మహబూబ్‌నగర్‌లలోని ఒక్కోకేంద్రంలో ఎన్నికలు 

నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీల పరిధిలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశిం చింది. బుధవారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మూడు చోట్ల టెండర్‌ ఓట్లు దాఖలైన నేపథ్యంలో ఈ పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా రీపోలింగ్‌ జరగనుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 41 వార్డులోని 101వ పోలింగ్‌ కేంద్రంలో, బోధన్‌లోని 32 వార్డులోని 87వ పోలింగ్‌ స్టేషన్‌లో, మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 41 వార్డులోని 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓట్లు పడటంపై సంబంధిత అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల నివేదికలను పరిశీలించి కామారెడ్డి, బోధన్, మహబూబ్‌నగర్‌లలోని మూడు పోలింగ్‌బూత్‌లలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నట్టుగా నిర్ధారించి, రీపోలింగ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఈ మూడు చోట్ల కూడా అసలు ఓటర్లకు బదులు గా ఇతరులు దొంగ ఓట్లు వేయడంతో, ఆ తర్వాత అసలు ఓటర్లు వచ్చి తమ ఓటును కోరడంతో సంబంధిత అధికారులు టెండర్‌ ఓట్లు వేయించారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పోలింగ్‌ ముగుస్తున్న సందర్భంగా కొందరు బురఖా ధరించిన ఓటర్లు వచ్చి టెండర్‌ ఓట్లు వేయడం, కామారెడ్డిలో కూడా బురఖా ధరించిన ఒక మహిళ బదులు మరో మహిళ ఓటేయడం, బోధన్‌లో ఒకరి పేరుపై మరో మహిళ ఓటు వేయడంతో టెండర్‌ ఓట్లు పడ్డాయని ఈ కారణంగా రీపోలింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్టు వేర్వేరుగా జారీ చేసిన 3 నోటిఫికేషన్లలో స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో ఓటర్ల గుర్తింపునకు తగిన ఆదేశాలున్నా ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, ఏజెంట్లు కూడా పట్టించుకోలేదని, కామారెడ్డి, బోధన్‌లలో ఒకరికి బదు లు మరొకరు దొంగ ఓటేసినా సిబ్బంది తగిన పత్రాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేయలేదని, ఏజెంట్లు అభ్యంతరం తెలపలేదని తెలిపారు. దీన్నిబట్టి ఎన్నికల ఏజెంట్ల నియామకం సరిగా చేయకపోవడమో లేక వారు కుమ్మక్కుకావడం వంటివి జరిగి ఉండొచ్చునని పేర్కొన్నారు. 

ఐదుగురిపై వేటు.. 
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 41 వార్డు 198వ పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే టెండర్‌ ఓట్లు పడ్డాయని ఐదుగురిని సస్పెండ్‌ చేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top