మినీ గోవాగా ఖ్యాతిగాంచిన గ్రామం 

Mudumal village Called Mini Goa In Mahabubnagar - Sakshi

ముచ్చటగొలిపే.. ముడుమాల్‌ 

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతంగా ప్రసిద్ధి

నిలువురాళ్లు ఏర్పాటు చేసిన ఆదిమానవులు!

పర్యాటకులను ఆకర్శిస్తున్న కృష్ణానది బీచ్‌ 

అభివృద్ధిపర్చాలంటూ గ్రామస్తుల వేడుకోలు 

సాక్షి, కృష్ణ (మక్తల్‌) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్‌ గ్రామం ఓ విశిష్టమైన, ఆధ్యాత్మిక, చారిత్రకమైన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆదిమానవులు, రుషులు, దేవతలు నడియాడిన ప్రాంతంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని నిలువురాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసినవిగా ఇప్పటికే పురావస్తు శాఖ గుర్తించి వాటిని కాపాడడానికి ప్రభుత్వం కృషిచేయాలని సంబంధిత శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇక్కడ చారిత్రాత్మకమైన యాదవేంద్రస్వామి మఠం, శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి తపస్సు ఆచరించినట్లు ఆధారాలు ఉండడంతోపాటు ఆయన సమకాలికుడే ఈ యాదవేంద్రస్వామి అని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

మరోపక్క ఈ మఠం పక్కనే కృష్ణానది, ఆ నదిలో ఇసుక మేటలతో సరిగ్గా గోవాలోని బీచును తలదిన్నే విధంగా ఉండడంతో ఇక్కడికి కర్ణాటక నుంచి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటివి ఒకేచోట.. ఒకే గ్రమంలో ఉండడం అరుదు. ఏడాది క్రితం మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ సతీమణి, పురావస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ విశాలాచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. దీంతో అప్పట్లో ఆమె పలుమార్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో కలిసి వ్యక్తిగతంగా పర్యటించారు. అదేవిదంగా ఈ గ్రామం గతంలో రాజులు, సంస్థానాధీశులు పరిపాలించారు. అప్పటి సంస్థానాధీశులు ఇక్కడి పేద ప్రజలకు వేలాది ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారు. ఇంతటి విశిష్టమైన ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధిపర్చాలని డిమాండ్‌ గ్రామస్తులు చేస్తున్నారు. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో..

సౌకర్యాలు కల్పించాలి 
ముడుమాల్‌ను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి చారిత్రాత్మకమైన ఆలయాలను అభివృద్ధిపర్చాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తాగునీటితోపాటూ ఇతర సౌకర్యాలు కల్పించాలి. ఇందుకు గాను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి చొరవ చూపాలి. 
 – అనిల్, ముడుమాల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top