సెలవులొస్తే జీతం కట్‌! 

Model School Teachers Worried About Salaries In Adilabad - Sakshi

 హవర్లీ బేస్డ్‌ ఉపాధ్యాయుల వేతనాల్లో కోత

అక్టోబర్‌లో మోడల్‌ స్కూళ్లు పనిచేసేది ఆరు రోజులే

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లెక్చరర్లు

సాక్షి, బోథ్‌(ఆదిలాబాద్‌) : వారంతా ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగానే బోధిస్తారు. కాని వేతనా లు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుకుంటున్నట్లు వారు అందుకోరు. సెలవులు వ స్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాల్లో ఎ లాంటి మార్పు ఉండదు. కాని హవర్లీ టీచర్లకు మాత్రం ఎటువంటి వేతనాలు ఉండ వు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. సమాన పనికి సమాన వేతనాలను అందించాలని వారు డిమాండ్‌చేస్తున్నారు. 

మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయ సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం గంటకు వేతనంగా నిర్ణయించి ఉపాధ్యాయులను నియమించింది. మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి నుంచి  పదో తరగతి ఇంటర్మీడియట్‌ విద్యాబోధన ఉంటుంది. వీరికి ప్రతి గంటకు రూ.140 చెల్లిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయులు కనీసం ఐదు క్లాసులు బోధిస్తారు. ఈ లెక్కన ఉపాధ్యాయులకు ప్రతి రోజు రూ.700 వరకు వేతనం ఉంటుంది. పాఠశాలకు సెలవు నేపథ్యంలో తరగతులు ఉండవు. కాబట్టి వీరికి వేతనాలు అందవు. నెలలో 30 రోజుల్లో నాలుగు ఆదివారాలు, ఒక రెండవ శనివారం పో నూ 25రోజులు పనిదినాలు ఉంటాయి. అంటే సగటున వీరు రోజుకు రూ.700ల వేతనా లను పొందితే 25 రోజులకు రూ.17 వేలా 500 రావాలి. కానీ ప్రభుత్వం నెలకు కేవలం 100గంటల వేతనాలను మాత్రమే చెల్లిస్తోంది. అంటే గరిష్టంగా వీరు రూ.14 వేలు మాత్రమే వేతనాలను పొందుతున్నారు. అది కూడా సెలవులు లేకపోతేనే.. అదే సెలవులు వస్తే వారి జీతాల్లో కోతే. నెలలో మరిన్ని సెలవులు వస్తే ఆ రోజుల్లో వేతనాలను కోల్పోతారు. దీంతో సగటున తమకు 12 వేల రూపాలయ వరకు మాత్రమే అందుతున్నాయని వాపోతున్నారు. 

అక్టోబర్‌లో అన్నీ సెలవులే..
అక్టోబర్‌ నెలలో దసరా సెలవులు రావడం, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించడంతో ఒక్క రో జు కూడా పాఠశాలలు పని చేయలేదు. దీంతో వారికి ఈ నెల వేతనాలు అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ నెలలో 31రోజులుండగా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. 21వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆదివారం, దీపావళికి రెండు రోజుల సెలవులు పోనూ మరో ఆరు రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు అక్టోబర్‌ నెలలో కేవలం ఆరు రోజుల వేతనాలను మాత్రమే అందుకోనున్నారు. అంటే కేవలం రూ.4200 మాత్రమే వారికి అందుతాయి. పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వకుండా హవర్టీ బేస్డ్‌ ఉపాధ్యాయులను వెట్టిచాకిరీ చేయిస్తున్నారని హెచ్‌బీటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమ బతుకులు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 14 మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 162 మంది ఉపాధ్యాయులు హవర్టీ బేస్డ్‌ టీచర్లుగా కొనసాగుతున్నారు. వీరు సగటుగా రూ.12 వేల నుంచి 13 వేల వరకు వేతనాలను పొందుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 1500 మంది హవర్లీ బేస్డ్‌ టీచర్లుగా పనిచేస్తున్నారని, వారికి సెలవుల్లో వేతనాల్లో కోతలను విధించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యాశాఖ రాష్ట్ర  జాయింట్‌ డైరెక్టర్‌ లింగయ్యను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. సమాన పనిక సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. 

సెలవులతో సంబంధం లేకుండా వేతనాలివ్వాలి 
మోడల్‌ స్కూళ్లో పనిచేసే హవర్లీ బేస్డ్‌ ఉపాధ్యాయులకు సెలవులకు సంబంధం లేకుండా వేతనాలను అందజేయాలి. సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సెలవులతో సంబంధం లేకుండా సిలబస్‌ను పూర్తి చేసే భారం తమదే అయినప్పుడు వేతనాలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  
 – చౌహాన్‌ గోవింద్, హవర్లీ బేస్డ్‌ టీచర్ల సంఘం (మోడల్‌ స్కూల్‌), జిల్లా అధ్యక్షుడు

ఫిక్స్‌డ్‌ వేతనాలు చెల్లించాలి 
గంటకు వేతనం కాకుండా ప్రతీ నెల ఫిక్స్‌డ్‌ వేతనాలను అందించాలి. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. సమాన పనికి సమాన వేతనాలను అందించాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. యూజీసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం వేతనాలను అందించాలి. సెలవులు వస్తే మా వేతనాల్లో కోతలు ఉంటున్నాయి. 
– పాలెపు గణేశ్, హవర్లీ బేస్డ్‌ ఉపాధ్యాయుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top