యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్‌! | Sakshi
Sakshi News home page

యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్‌!

Published Thu, Feb 1 2018 1:41 AM

MMTS to the Yadadri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంఎంటీఎస్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే రైలు మార్గాన్ని పొడిగించేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంది. రాయగిరి నుంచి యాదాద్రి (4 కి.మీ.) వరకు కొత్త లైన్‌లను నిర్మించి, విద్యుదీకరించి, యాదాద్రిలో స్టేషన్‌ నిర్మిస్తారు. స్టేషన్‌ నిర్మాణానికి 40 నుంచి 50 ఎకరాలు కేటాయించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉంది. తాజా బడ్జెట్‌ నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తలైన్లు, రైల్వేసేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైల్వేశాఖ సీరియస్‌గా పరిశీలిస్తుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ రెండో దశను పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మార్గాన్ని రాయగిరి వరకు పరిమితం చేయకుండా యాదాద్రి వరకు విస్తరించాలని ప్రభుత్వం కోరితే మరో 3 ఏళ్లలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.  

లక్షలాది మందికి రైల్వే సదుపాయం ... 
ప్రస్తుతం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతి రోజు సుమారు 3 లక్షల మంది సందర్శిస్తుండగా, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య 5 లక్షలు దాటుతోంది. హైదరాబాద్‌ నుంచి వందలాది బస్సులు, వేల సంఖ్యలో ప్రైవేట్‌ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఘట్కేసర్‌ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌లను విస్తరించేందుకు రైల్వేశాఖ రూ.330 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో 51 శాతం నిధులను రాష్ట్రం భరిస్తే మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ భరించనున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానించేందుకు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పూర్తవుతుందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. యాదాద్రి వరకు రైల్వేమార్గాన్ని పొడిగిస్తే 5 ప్లాట్‌ఫామ్‌లతో ఒక టర్మినల్‌ను నిర్మించే యోచన చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement