హరితపథం

MLA Srinivas Goud Haritha Haram Program In Mahabubnagar - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమ నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా నాలుగో విడత హరితహారం గురువారం ప్రారం భం కానుంది. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండగా.. శాఖల వారీగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. జూలై నెల మొదట్లో వర్షాలు కురవగా.. అప్పుడే హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని అధికారులు భావించినా కుదరలేదు. దీంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
 
గుంతలు.. మొక్కలు 
జిల్లావ్యాప్తంగా మొత్తం 185 నర్సరీలు ఉన్నాయి. ఇందులో అటవీ శాఖ ఆధ్వర్యాన 115, డీఆర్‌డీఓ ఆధ్వర్యాన 70 నర్సరీల్లో హరితహారానికి అవసరమైన మొక్కలు సిద్ధం చేశారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవగా హరితహారం ప్రారంభించాలనుకున్నా మళ్లీ వెనుకడుగు వేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల మొక్కలు నాటా రు. ఇక నుంచి గురువారం నుంచి పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గుంతలు తీయడం పూర్తికాగా, నాటాల్సిన మొక్కలపై శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు.
 
1.97 కోట్ల మొక్కలు... 
నాలుగో విడత హరితహారంలోభాగంగా జిల్లాలో 1.97 కోట్లు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో 1.03 కోట్ల టేకు మొక్కలు, 15 లక్షలు ఈత మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. ఇక అత్యధికంగా ఐకేపీ–డ్వామా(డీఆర్‌డీఓ) ఆధ్వర్యాన 1,56,28,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే, ఎక్సైజ్‌కు 10 లక్షలు, అటవీ శాఖకు 10 లక్షలు, పశు సంవర్థక శాఖకు 3 లక్షలు, పోలీస్‌ శాఖకు 10 వేలు, పీయూకు 30 వేలు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు 20 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా అత్యల్పంగా బీసీ సంక్షేమ శాఖ, సివిల్‌ సప్లయీస్, రవాణా శాఖలకు కేవలం వెయి చొప్పున లక్ష్యం నిర్ణయించారు. ఇక మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 2 లక్షలు, నారాయణపేట పరిధిలో 50 వేల మొక్కలు నాటనున్నారు. 

మొక్కల ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలి 
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మొక్కల పెంపకం ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉపాద్యాయులపై ఉందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యాన స్థానిక పిల్లలమర్రి సమావేశ హాల్‌లో హరిత పాఠశాల, స్వచ్ఛ పాఠశాల అంశాలపై విద్యా శాఖ అధికారులకు బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్‌ మాట్లాడుతూ భావి తరాలైన విద్యార్థులకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత, వాటితో లాభాలను వివరించాలన్నారు. పాఠశాలతో పాటు ఇళ్లలో మొక్కలను పెంచేలా విద్యార్థులకు ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మొక్కలను ఎలా నాటాలి, ఎంత లోతు గుంత తీయాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డీఎఫ్‌ఓ గంగారెడ్డి మాట్లాడుతు ప్రతీ మండలం నుంచి ఎంఈఓ, ఓ హెచ్‌ఎంతో పాటు అటవీ శాఖ ఉద్యోగికి అవగాహన కల్పించగా.. వారు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు వివరించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. 

ఈత మొక్కలను కాపాడుకోవాలి 
పాలమూరు: ఈత మొక్కలను కాపాడుకోవ డం వల్ల గీత కార్మికులకు భవిష్యత్‌లో ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎక్సైజ్‌ శాఖకు ప్రజలందరూ సహకరిస్తే హరితహారం విజయవంతమవుతుందన్నారు. హరితహారంలో భాగంగా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యాన బుధవారం హన్వాడ మండలం చిన్నదర్పల్లి శివారులోని సహదేవుడుగౌడ్‌ పొలంలో ఎమ్మె ల్యే, ఆబ్కారీ శాఖ ఉమ్మడి జిల్లా డీసీ జయసేనారెడ్డితో పాటు అధికారులు, గీత కార్మికులు కలిపి 3వేల ఈత  మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ హరితహారంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సీజన్‌ లో జిల్లావ్యాప్తంగా 11 లక్షల ఈత మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సై జ్‌ ఈఎస్‌ అనిత, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతోనే మానవ జీవనానికి మనుగడ 
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే మానవ జీవనానికి మనుగడ ఉంటుందని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ అన్నారు. స్థానిక డిపో ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజనల్‌ మేనేజర్‌ మహేశ్, స్థానిక డిపో మేనేజర్‌ రాజగోపాలాచారితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఆర్‌ఎం బి.వరప్రసాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top