ట్విట్టర్‌ బాంధవుడు..!

Minister KTR helping hand to the Conductor - Sakshi

  కోమాలోకి వెళ్లిన కండక్టర్‌కు కేటీఆర్‌ చేయూత 

  రూ.16 లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు  

  మంత్రి హామీతో ఆపరేషన్‌..సక్సెస్‌ 

  కోలుకుంటున్న బాధితుడు 

సిరిసిల్ల: ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్‌.. ఈసారి ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడారు. హైబీపీతో మెదడులో నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిన అతడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బేరుగు రమేశ్‌ (40) నరాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు.

కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. 12 గంటల్లో ఆపరేషన్‌ చేయాలని, ఇందుకోసం రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులను ఆశ్రయించారు. సర్వీసు ఆధారంగా రూ.4 లక్షలకు మించి ఆరోగ్యబీమా వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు. డబ్బులు చెల్లిస్తేనే ఆపరేషన్‌ చేస్తామని డాక్టర్లు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో బాధితుడు రమేశ్‌ బావ అనిల్‌కుమార్‌ వెంటనే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్, వాట్సాప్‌కు రమేశ్‌ పరిస్థితిని వివరిస్తూ మెసేజ్‌ పెట్టారు. 

స్పందించిన మంత్రి కేటీఆర్‌: కండక్టర్‌ రమేశ్‌ పరిస్థితిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. వెంటనే ఆపరేషన్‌ చేయాలని ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లిస్తామని, ఒకవేళ అలా సాధ్యం కాకుంటే.. సొంతగా ఆ డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడంతో 12 మంది డాక్టర్లు ఐదున్నర గంటలపాటు శ్రమించి రమేశ్‌కు ఆపరేషన్‌ చేశారు. రమేశ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి కేటీఆర్‌కు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శులకు రమేశ్‌  భార్య అరుణ, పిల్లలు సాత్విక్, ప్రగతి కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top