ఏజెన్సీలో మెరుగైన సేవలు

Minister Etalal Rajender Visits Khammam District Talks About Agency Mediacal Services - Sakshi

సాక్షి, కొత్తగూడెం : మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం కొత్తగూడెం వచ్చిన మంత్రి.. జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వైద్య శాఖ అధికారులతో డీఆర్‌డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు వచ్చాక వైద్య సేవలు అందించడం కంటే అవి ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకునే విషయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసే జిల్లా భద్రాద్రి జిల్లా అని అన్నారు. ఇలాంటి ఏజెన్సీ జిల్లాలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం వరంగా భావించాలన్నారు. కష్టపడి వైద్యసేవలు అందజేస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. నెగెటివ్‌ ప్రచారాన్ని చూసి కుంగిపోవద్దని చెప్పారు.

జిల్లాలో 137 డెంగీ కేసులు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక్క డెంగీ మరణం కూడా లేకుండా చేశారని వైద్య సిబ్బందిని అభినందించారు. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి టీచర్లతో కమిటీలు వేసి వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రి ప్రసంగం ప్రారంభిస్తూ అందరూ పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా అని అడగగా సమావేశ మందిరంలో నిశ్శబ్ధం కనిపించింది. అనంతరం కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి జ్వరం కేసుకు సంబంధించి రక్తపరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి రక్త  పరీక్షలు చేశామని, 379 మలేరియా, 137 డెంగీ కేసులు గుర్తించామని తెలిపారు. జిల్లాలో సీఎస్‌ఆర్, ఎల్‌డబ్ల్యూఈ నిధుల ద్వారా సైతం వైద్యసేవలు అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ పీవీ.గౌతమ్, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాస్, జెడ్పీ వైస్‌చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి 
చండ్రుగొండ జెడ్పీటీసీ సభ్యుడు కొడకండ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింగరేణి కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. సింగరేణికి ఇక్కడ అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మైనింగ్‌ కళాశాల ద్వారా నాణ్యమైన మైనింగ్‌ ఇంజినీర్లు వస్తున్నారని అన్నారు. 
సింగరేణి మెడికల్‌ కళాశాల నెలకొల్పి మంచి వైద్యులను అందజేయడంతో పాటు, ఏజెన్సీ ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందించాలని కోరారు. 

మణుగూరులో వైద్యులను నియమించాలి 
మణుగూరు జెడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు మాట్లాడుతూ మణుగూరులో ఏరియా ఆసుపత్రి నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అందులో వైద్యులను నియమించలేదన్నారు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు మండలాల నుంచి పోస్టుమార్టం కోసం భద్రాచలం, బూర్గంపాడు వెళ్లాల్సి వస్తోందని, దీంతో మృతుల కుటుంబాలకు అధిక వ్యయభారం అవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మణుగూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలన్నారు. ఆళ్లపల్లి, జానంపేట పీహెచ్‌సీలకు వైద్యలను నియమించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top