అవస్థల బడి

Minimum Facilities Govt Schools Warangal - Sakshi

 నాలుగు చినుకులు పడగానే కురిసే పై ఫొటోలోని ఈ పాఠశాల  నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఉంది. ఈ  ప్రాథమిక పాఠశాలలో 81 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు.. ఒక హెచ్‌ఎం ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతం. 

కాళోజీసెంటర్‌: అందరికీ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాని కి అవాంతరాలు తప్పడం లేదు. ఉపాధ్యాయులకు కొరతకు తోడు పలు చోట్ల మౌలిక వసతులు వేధిస్తుండడంతో సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి.   జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండానే ఈ విద్యా సంవత్సరం సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 460 ఉండగా 15,972 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 83 లో 4,422 మంది విద్యార్థులు, హైస్కూల్‌ పాఠశాలలు 153లో 21,727 మంది, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు 12, మోడల్‌ స్కూల్స్‌6, ఇవ్వే కాకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 8, ఎస్టీ గురుకులాలు 2, మొత్తం 724 పాఠశాలలు ఉన్నాయి.

వీటిలో45,275 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2,988 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినపటికీ క్షేత్రస్థాయిలో అమలు కాక   ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మరుగుదొడ్లు మద్యాహ్న భోజనం కోసం వంట గదులు లేని పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏటా ఎమ్మార్సీ సమావేశంలో సమస్యలను గుర్తించి నివేదికలు అడుగుతున్నారే తప్ప సమస్యలను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నా యి. అతేకాకుండా కొన్ని పాఠశాలల భవనాలు శిధిలావస్థల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోన్నప్పటికీ నత్తనడకన పనులు సాగుతున్నాయి.

36 పాఠశాలలు మూత
రూరల్‌ జిల్లా పరిధిలో 460 ప్రాథమిక పాఠశాలలు ఉండగా విద్యార్థులు లేక గత ఏడాదే 36 పాఠశాలలు మూతపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల తల్లీదండ్రుల ఆలోచన మారుతున్నది. తమబిడ్డల చదువులో ఉత్తమశ్రేణిలో మార్కులు సాధించాలని, ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కళలు కంటున్నారు. అదే స్థాయిలో గ్రామీ ణ పాంతాల్లో కార్పొరేట్‌ స్కూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడి యం లేక ఉత్తమ ఫలితాలు రాక ప్రైవేట్‌ బడుల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయనే విమర్శలు వçస్తున్నాయి.

ఉద్యోగ బాధ్యతలు మరిచి..
ఉద్యోగం చేసే చోటనే ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా పట్టణాల నుంచి బస్సుల్లో ప్రయాణం చేయడం మూలంగా పాఠశాలకు సమయానికి హాజరు కావడం లేదని స్థానిక ప్రజల నుంచి విమర్శలు లేకపోలేదు. అంతే కాకుండా సాయంత్రం సమయం కంటే ముందే తిరుగు ప్రయాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది టీచర్లు ఫైనాన్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారై బడులు మూతపడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.. 
సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషిచేస్తున్నాం.  60 పాఠశాలలు టెన్త్‌ క్లాస్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత సంవత్సరం 88.75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 95.87 శాతం సాధించాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. – పెగడ రాజీవ్, ఇన్‌చార్జి డీఈఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top