ఆరోగ్యం అంధకారంలోకి.. చదువులు పాతాళంలోకి.. | Chandrababu govt Not caring of AP govt schools: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం అంధకారంలోకి.. చదువులు పాతాళంలోకి..

Nov 30 2025 4:52 AM | Updated on Nov 30 2025 4:52 AM

 Chandrababu govt Not caring of AP govt schools: Andhra pradesh

ప్రభుత్వ పాఠశాలల్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

పాఠశాలల్లో నిలిచిపోయిన వైద్య పరీక్షలు

జూలైలో పీటీఎం టెస్టుల పేరుతో హడావుడి

తర్వాత పట్టించుకోని ప్రభుత్వం

అస్వస్థతలతో విద్యార్థుల మరణాలు

గత ప్రభుత్వంలో ప్రతినెలా 45 లక్షల మందికి వైద్య పరీక్షలు

అప్పట్లో హెల్త్‌ కార్డులతో ఎప్పటికప్పుడు ఆరోగ్య పర్యవేక్షణ

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రతినెలా ప్రభుత్వాస్పత్రి, విలేజ్‌ క్లినిక్‌ల సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేవారు. రక్త పరీక్షలు చేసి విద్యార్థుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించి వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేసేవారు. రక్తహీనత ఉంటే ఐరన్‌ మాత్రలు ఇచ్చి జాగ్రత్తలు సూచించేవారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చి ప్రతినెలా ఆరోగ్య పరీక్షల్లో వచ్చిన ఫలితాలను వాటిలో నమోదు చేసేవారు. ఫలితంగా పిల్లల ఆరోగ్యం మెరుగుపడేది. ఇలా ప్రతి నెలా దాదాపు 45 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి తారుమారైంది.  

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ విద్యను పూర్తిగా నీరుగార్చడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. పాలకుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 34 లక్షలకు తగ్గిపోయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేసి అందించిన ఆరోగ్య కార్డులు సైతం ఇప్పుడు కనిపించకుండా పోయాయి. గతేడాది మెగా పీటీఎం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసిన సర్కారు ఒక్కరోజే వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేసింది. ఆ తర్వాత ఆ ఆలోచనే చేయడం మానేసింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ సైతం తన బాధ్యత కాదని వదిలేసింది. 

34 లక్షల మంది పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో మెగా పేరెంట్‌–టీచర్స్‌ సమావేశం నిర్వహించింది. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించామంటోంది. 96 శాతం మంది పిల్లలకు పరీక్షలు చేయించినట్టు ప్రకటించి.. వివరాలను హోలిస్టిక్‌ మార్కుల లిస్టుకు అనుసంధానం చేసినట్టు చెబు­తోంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం మందికి, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 97.07 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 89 శాతం పూర్తిచేసినట్టు ప్రకటించింది. జూలై తర్వాత మళ్లీ పరిస్థితి ఏమిటనేది పట్టించుకున్న పాపానపోలేదు. గత ప్రభుత్వంలో ప్రతినెలా పరీక్షలు చేసి తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇచ్చేవారు. అలాగే కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా అందించారు. ప్రస్తుతం ఈ విధానం పూర్తిగా నీరుగారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఇంటరీ్మడియట్‌ వరకు 34 లక్షల మంది విద్యార్థులున్నా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. ఇక సంక్షేమ వసతి గృహాల్లో పిల్లల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

అస్వస్థతలతో మరణాలు
చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి ఎన్నో ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టళ్లలో అస్వస్థతకు గురైన విద్యార్థులు వందల్లో ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మృతి చెందారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల సంఖ్య 22 మంది కంటే ఎక్కువేనని అంచనా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 184 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు.

వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిధిలోని డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారంతో 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఒక ప్రైవేట్‌ ట్రస్ట్‌ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు మరణించారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

అవాంఛనీయ ఘటనలెన్నో..
కొన్ని పాఠశాలల్లో బాలికలకు పాఠశాలలు, హాస్టళ్లలోనే అబార్షన్లు అయిన ఘటనలు కూడా వెలుగు చూ­శాయి. కొన్ని కాన్పులు సైతం జరిగాయి. కడప గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ స్థానిక కళాశాలలో ఒకేషనల్‌ చదవుతున్న 17 ఏళ్ల బా­లిక 9 నెలల గర్భంతో ఉన్నా సిబ్బంది గుర్తించలేని పరిస్థితి. గతేడాది డిసెంబర్‌లో గుంటూరు సాంఘిక సంక్షేమ హాస్టల్‌ ఉంటున్న ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డను హాస్టల్‌లోనే ప్రసవించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లోనే ఏలూరు జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న మైనర్‌ బాలిక హాస్టల్‌లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సిబ్బంది గమనించలేదు. ప్రతినెలా వైద్య పరీక్షలు చేసి ఉంటే ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉండే­ది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంతమంది పిల్లల తల్లిదండ్రులకు తీరని వేదనకు గురి చేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement