‘కొనుగోలు’ ప్రణాళిక సిద్ధం చేయండి | Sakshi
Sakshi News home page

‘కొనుగోలు’ ప్రణాళిక సిద్ధం చేయండి

Published Fri, Mar 23 2018 2:47 PM

Meeting On Rabi Season Crop Purchase - Sakshi

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. రబీ ధాన్యం కొనుగోళ్లపై గురువారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మే నెలలో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోదాంలకు దగ్గరగా ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా తాడిపత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గన్నీ బ్యాగ్‌ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్‌ మొదటి వారంలో 259 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం 62 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. సీఎంఆర్‌ రికవరీ 99.5 శాతం పూర్తయిందని, ఇంకా రెండు మిల్లర్ల నుంచి ధాన్యం రావాల్సి ఉందన్నారు. డిఫాల్టర్‌ మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ పెట్టామని చెప్పారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 2,739 దరఖాస్తులు కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చినట్లు వెల్లడించారు. సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ డీఎం హరికృష్ణ, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీఎస్‌వో కృష్ణప్రసాద్, మార్కెటింగ్‌ ఏడీ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement