రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

Medak Farmers Looking For Loan Waiver - Sakshi

ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్లు

గతంలో నాలుగు విడతలుగా రుణమాఫీ

జిల్లాలో సుమారు 65 వేల మంది అర్హులు

రూ.400 కోట్లు అవసరమని అంచనా

సాక్షి, మెదక్‌: కరువు కాలంలో వరుస పంట నష్టాలతో కుదేలైన రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించింది రుణమాఫీ పథకం. సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీ మేరకు మళ్లీ ఈ పథకం అమలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటం.. ముక్కుపిండి మరీ వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగుతున్న నేపథ్యంలో విధిలేక అప్పులు చేస్తున్నారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో సర్కారుపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తున్నారు.

రైతుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమచేసింది. కరువు కాలంలో ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చింది.

ఈ క్రమంలో ఇటీవల(2019) ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ‘గులాబీ’ బాస్‌ కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రెండోసారి సైతం అధికారంలోకి రాగా.. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్‌ రెండో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీపై అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. 

కటాఫ్‌ తేదీ 2018 డిసెంబర్‌ 11
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మార్గదర్శకాల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి.. జిల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొత్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు సేకరించి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ప్రధానంగా కటాఫ్‌ డేట్‌ డిక్లేర్‌ అయితే ఈ వివరాలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో 2018 డిసెంబర్‌ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి మాఫీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

2014లో నాలుగు దఫాలుగా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించి మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతుల పంట రుణాలు సుమారు రూ.16,125 కోట్లను బ్యాంకుల్లో జమచేసింది. మెదక్‌ జిల్లాకు సంబంధించి 20 మండలాల్లోని 1,27,098 మంది రైతులకు రూ.603.72 కోట్ల రుణమాఫీ వర్తించింది.  

65 వేల మంది రైతులు.. రూ.400 కోట్లు 
గతంలో నాలుగు విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పటికీ కొందరు రైతులకు ప్రయోజనం చేకూరలేదు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో రుణమాఫీకి సంబంధించి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఉన్న రైతుల కంటే ఈ సారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు 65 వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులని.. రూ.400 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం.

వడ్డీ తిప్పలు..
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. అయితే.. వాటికి ఏటేటా వడ్డీ కట్టాలి. రెన్యూవల్‌ చేయకుంటే రుణమాఫీకి అర్హులు కారని.. కచ్చితం గా మిత్తి కట్టాల్సిందేనని బ్యాంకర్లు రైతుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నారు. తూప్రాన్‌తోపాటు పలు ప్రాంతాల్లో పలువురు రైతులకు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు అప్పులు చేసి వడ్డీ కడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరగా రుణమాఫీ నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

వడ్డీ కట్టకుంటే ఊరుకుంటలేరు
నాకున్న రెండెకరాలకు సంబంధించి శివ్వంపేటలోని ప్రాథమిక సహకార సంఘంలో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేయాలి. బ్యాంకు అధికారులు వడ్డీ కట్టకుంటే ఊరుకుంటలేరు. వడ్డీ కట్టి రెన్యువల్‌ చేసుకుంటేనే రుణమాఫీ వర్తిస్తుందని చెబుతున్నరు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు ప్రారంభమైనందున తక్షణమే రుణమాఫీ డబ్బులు అందజేస్తే బాగుంటుంది.      
 – సంజీవరెడ్డి, రైతు, ఎదుల్లాపూర్, శివ్వంపేట 

సగం వడ్డీకే పోయినయ్‌..
పోయినసారి రుణమాఫీ పైసలు సగం వడ్డీకే పోయినయ్‌. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకింత రుణం కావాలని బ్యాంకుకు పోతే.. పాతవి కడితే పెంచి ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ డబ్బులు అందజేయాలి. పోయినసారి పంటల బీమా అందలేదు. ఈ సారి కూడా బీమా సొమ్ము కడితేనే వర్తిస్తుందంటున్నారు. రుణమాఫీ కోసం చూస్తే బీమా కూడా అందకుండా పోతుంది.  
 – బానోత్‌ చత్రు, కామారం తండా, చిన్నశంకరంపేట 

బ్యాంకు నుంచి నోటీసు ఇచ్చిండ్రు
తూప్రాన్‌: నాకు రెండేకరాల పొలం ఉంది. పంట సాగు కోసం తూప్రాన్‌లోని వ్యవసాయ సహకార బ్యాంకులో 2009లో రూ.70 వేల రుణం తీసుకున్న. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేసింది. కానీ నాలుగు దఫాలుగా చేసింది. నాకు రూ.70 వేలు మాఫీ అయ్యాయి. అయితే అప్పటికే బ్యాంకు అధికారులు వడ్డీకి వడ్డీ కలుపుతూ రూ.1.13లక్షలు కట్టాలని నోటీసు ఇచ్చిండ్రు. ఒకే సారి మాఫీ చేయకపోవడంతో మాపై భారం పడింది.                      
 – పెంటారెడ్డి, రైతు, గుండ్రెడ్డిపల్లి
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top