ఏకగ్రీవ ప్రోత్సాహం 

Medak District  Unanimous Gram Panchayat Polls - Sakshi

పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. ఇక ఓట్ల యుద్ధమే మిగిలింది. ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా పంచాయతీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వ్‌డ్‌ స్థానాల్లో ఈ రకమైన ప్రయత్నాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏకగ్రీవంగా సర్పంచ్‌ ఎన్నికైతే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని కూడా పెంచనుందని సమాచారం. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే పలు గ్రామాల్లో ఏకగ్రీవంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. 

సాక్షి, మెదక్‌: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్‌కు అనుగుణంగా పంచాయతీ బరిలో దిగేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతూనే పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు నాయకులు కసరత్తు ప్రారంభించారు.  సర్పంచ్‌ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా ఇతర గుర్తులపై జరుగుతాయి. దీనికి తోడు స్థానికంగా తమ బాగోగులు చూసే, గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకునేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలో చాలాచోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 పార్టీలు సైతం ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో పోటీని నివారించేందుకు పావులు కదుపుతున్నారు. మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవం అయ్యేలా చూసే బాధ్యతను నియోజకవర్గ ముఖ్యనేతలు, మండల పార్టీ అధ్యక్షులకు అప్పగిస్తున్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నిక చేసుకుంటే ప్రభుత్వం రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. నగదు ప్రోత్సాహాన్ని రూ.10 లక్షలకు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ నియోకజవర్గ నిధుల నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు మరో రూ.10 లక్షలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ మద్దతుతో పంచాయతీ బరిలో దిగాలనుకుంటున్న ఆశావహులు ఏకగ్రీవం వైపు చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈనెల 7వ తేదీన తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మలి, తుది విడత ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే మిగితా మండలాల్లోనూ ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. దీంతో సర్పంచ్‌గా పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ఏన్నిక ఏకగ్రీవంగా జరగాలని చూస్తున్నారు.

ఇందుకోసం గ్రామ పెద్దలు, ఎన్నికల్లో ప్రభావితం చేసే వర్గాలతో సమావేశమై వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ ఆశావహులు తమ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వత్తిడి తీసుకువచ్చి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా పావులు కదుపుతున్నారు. మరోవైపు మాజీ సర్పంచ్‌లు సైతం ఏకగ్రీవ ఎన్నికవైపు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో పట్టున్న కాంగ్రెస్‌ నాయకులు ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
రిజర్వుడ్‌ పంచాయతీల్లో అవకాశం 
జిల్లా వందశాతం ఎస్టీ రిజర్వు అయిన పంచాయతీలు, కొత్తగా పంచాయతీలుగా మారిన తండాల్లో ఏకగ్రీవ ఎన్నికకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో వందశాతం ఎస్టీలు ఉన్న పంచాయతీలు 63 ఉండగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు 50కిపైగా ఉన్నాయి. వీటిలో మెజార్టీ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వు అయిన 66 పంచాయతీల్లోనూ ఈ దిశగా ఆశావహులు కసరత్తు ప్రారంభించారు.

బీసీ, జనరల్‌ రిజర్వు అయిన పంచాయతీల్లోనూ  ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెదక్‌ నియోజకవర్గంలోని రామాయంపేటలో దామచెర్వు గ్రామంలో కేటీఆర్‌ బంధువు, మాజీ సర్పంచ్‌ రామారావు ఏకగ్రీవంగా సర్పంచ్‌ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదే మండలంలోని కిషన్‌తండా, దంతేపల్లి, నిజాంపేట మండలంలోని నగరం తండా, జడ్చర్వు తండా ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తున్నాయి.

హవేళిఘణపూర్‌ మండలంలో శమ్నాపూర్, గంగాపూర్‌ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలంలో మూడు, కౌడిపల్లిలో మూడు, నర్సాపూర్‌లో 5కుపైగా పంచాయతీలు ఏకగ్రీవం దిశగా అడుగులు పడుతున్నాయి. తూప్రాన్‌ డివిజన్‌లో సైతం సర్పంచ్‌ ఆశావహులు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top