
రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్ మెహదిరట్టాతో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి
సాక్షి, మెదక్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ కలెక్టరెట్‌లో రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్ మెహదిరట్టాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతీ ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉంటారని, అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశమన్నారు. పాఠశాల, కళాశాలస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, వ్యవసాయదారులు, ఇతర రంగాలలో పనిచేసేవారు, శాస్త్రీయ అవగాహన కలిగిన ఎవరైనా తమ ఆలోచనలను, ఆవిష్కరణలకు సంబంధించిన వీడియో, ఐదు వ్యాక్యాలు, పంపేటువంటి వ్యక్తి పేరు, ఇతర వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపించాలన్నారు. అలా పంపినవారిలో తెలంగాణా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు ఎంపిక చేసినవారు ఆగస్టు 15న జరిగే ప్రదర్శనలో ప్రదర్శించవచ్చని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారికి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8328599157 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.