
రాంగోపాల్‌పేట్: హైదరాబాద్‌లోని వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు తగిన మాస్టర్ ప్లాన్ అవసరమని, దీనికి గానూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. సోమవారం బేగంపేట్‌లోని మెట్రో భవన్‌లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను అర్థం చేసుకోవడం అనే అంశంపై మున్సిపల్ పరిపాలన శాఖ సహకారంతో యునెస్కో, ఆగా ఖాన్ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇది రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అర్వింద్ మాట్లాడుతూ.. వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధమైన విధానం అవసరమన్నారు.
హైదరాబాద్‌లో 26 హెరిటేజ్ నిర్మాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. చార్మినార్,లాడ్‌బజార్, మక్కా మసీద్, సర్దార్ మహల్, చౌమహుల్లా ప్యాలస్ తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ‘టూరిస్ట్ వాక్ వే’ను రూపొందించే యోచన ఉందన్నారు. సృజనాత్మకత, పచ్చటి నగరాల నిర్మాణం తదితర అంశాలపై ఢిల్లీలోని యునెస్కోకు చెం దిన సాంస్కృతిక విభాగం ప్రతిని«ధి జునీహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆగాఖాన్ ట్రస్టుకు చెందిన ప్రశాంత్ బెనర్జీ, పరిరక్షణ ఆర్కిటెక్ట్ పరోమిత దేసార్కర్ తదితరులు పాల్గొన్నారు.